ఇంటర్వ్యూ : నాని – ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నేను సిద్దంగానే ఉన్నాను !

వరుస విజయాలను అందుకుంటున్న హీరో నాని తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఇందులో చేసిన ద్విపాత్రాభినయంలో కొత్తదనం ఏమిటి ?
జ) నేను ద్విపాత్రాభినయం చేసిన రెండు సినిమాలు ‘జెండాపై కపిరాజు, జెంటిల్మెన్’లలో రెండు పాత్రలకి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటాయి. కానీ ఇందులో రెండు పాత్రలకి సంబంధం ఉండదు. ఎవరి సమస్యలతో వాళ్ళు పోరాడుతుంటారు. అలాంటి ఇద్దరూ కథలో ఎలా కలుసుకున్నారు అనేదే సినిమా.

ప్ర) రెండు పాత్రల్లో మీకు బాగా నచ్చినది ఏది ?
జ) నాకు కృష్ణ పాత్ర బాగా నచ్చింది. ఆ పాత్రలోనే ఎక్కువ ఫన్ ఉంటుంది. ఆ పాత్ర చేయడం కొద్దిగా ఛాలెంజింగా కూడ అనిపించింది. చిత్తూరు భాష మాట్లాడటానికి మొదట్లో కొంత ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత మా డైరెక్టర్ గాంధీ సహాయంతో అన్నీ కుదురుకున్నాయి.

ప్ర) అనుపమ పరమేశ్వరన్ తో వర్క్ ఎలా ఉంది ?
జ) చాలా బాగుంది. ఆమె పాత్ర సింపుల్ గానే ఉన్నా ఆమె కనిపించిన ప్రతిసారి ఏదో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆమె పాత్ర అందరికీ నచ్చుతుంది.

ప్ర) సినిమాలో ఏది బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు ?
జ) సినిమాలో మంచి కామెడీ, ఎమోషన్, రొమాన్స్ ఉన్నాయి. సినిమాలో యంగ్ కమెడియన్స్ చేసిన ఫన్ అందరికీ నచ్చుతుంది. ఈ వేసవిలో ఈ సినిమా నాకు మంచి సక్సెస్ ఇస్తుందని నమ్మకంగా ఉన్నాను.

ప్ర) ఇటీవల వచ్చిన మీ స్టార్ స్టేటస్ ను మీరెలా తీసుకుంటారు ?
జ) చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. కానీ ఒక్కోసారి మన జడ్జిమెంట్ తప్పవచ్చు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి కూడ నేను సిద్దంగానే ఉన్నాను.

ప్ర) ఇకపై కూడ ‘అ !’ లాంటి సినిమాల్ని చేస్తారా ?
జ) చేస్తాను. ‘అ !’ సినిమా నాకు పెద్ద మోటివ్. నాకు అన్నీ ఇచ్చిన ఇండస్ట్రీకి కొత్త దర్శకుల్ని పరిచయం చేయాలని అనుకుంటున్నాను. కొత్తవాళ్లకి సపోర్ట్ అవసరం. నేనెప్పుడూ దానికి సిద్దంగానే ఉంటాను.

ప్ర) నాగార్జునగారితో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) మేము ఇప్పటికే ఒక వారం పాటు షూటింగ్ చేశాం. అది కూడ ఒక పాటకి. ఆయనతో నటించడం చాలా ఎగ్జైటింగా, సంతోషంగా ఉంది.

ప్ర) బిగ్ బాస్ హాసోకి మీరే నెక్స్ట్ హోస్ట్ అంటున్నారు. దానిపై మీ కామెంట్ ?
జ) నేనైతే దాని గురించి ఇప్పుడేం మాట్లాడదల్చుకోలేదు. మా ఛానెల్ వాళ్ళే సరైన సమయం చూసి ఎవరు హోస్ట్ అనేది ప్రకటిస్తారు.

ప్ర) కొరటాల శివతో కూడ ఒక సినిమా చేస్తారట కదా. నిజమేనా ?
జ) కొరటాల శివగారిని కలిసి చాలా కాలమైంది. ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో తెలీడంలేదు. ప్రస్తుతం నా సినిమాల్లో నేను బిజీగా ఉన్నాను. ఇప్పుడప్పుడే ఆయనతో సినిమా చేసే వీలుండదు.

ప్ర) మీ తర్వాతి సినిమాలు ?
జ) ఒక ఐదు సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. ఏది ముందుగా మొదలవుతుందో చెప్పలేం. ఏదైనా ఇప్పుడు చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా పూర్తయ్యాకే డిసైడ్ చేస్తాను.