
ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కథానాయకుడు డామినేషన్ ఉండే ఇండస్ట్రీ.. ఇక్కడ గ్లామర్ అవసరం కానీ కథానాయికలకి తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే సినిమాలు తక్కువ వస్తుంటాయి. కానీ మిల్క్ బ్యూటీ తమన్నా మాత్రం నాకు అలాంటి అసంతృప్తి ఏమీ లేదని, నా వరకూ చెప్పుకోవడానికి చాలా మంచి సినిమాలే ఉన్నాయని అంటోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న తమన్నా తెలుగులో బాహుబలి మరియు బెంగాల్ టైగర్ సినిమాల్లో నటిస్తోంది. ఇందులో బాహుబలి సినిమాకి ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేస్తే, బెంగాల్ టైగర్ కి ఇటీవలే షూటింగ్ మొదలైంది.
ఈ భామని మీ 10 ఏళ్ళ హీరోయిన్ కెరీర్ సంతృప్తి కరంగా ఉందా అని అడిగితే ‘నాకెప్పుడు అసంతృప్తి లేదు. పది మందికి గర్వంగా నేను ఈ సినిమాలు చేసానని చెప్పుకోవడానికి కొన్ని సినిమాలు ఉన్నాయి.కేవలం సక్సెస్ అనే టార్గెట్ పెట్టుకొని నేనెప్పుడు సినిమాలు చేయలేదు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మెప్పించాలి, కొత్తగా కనిపించాలనే సినిమాలు చేసాను. నా పదేళ్ళ సినీ ప్రయాణం నాకు చెప్పలేనంత ఆనందం ఇస్తుందని’ తమన్నా అంటోంది.

