ఇంటర్వ్యూ : నాగశౌర్య – కొత్త దర్శకులతో చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతాను !
Published on Aug 23, 2018 11:00 am IST

నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రాబోతున్న చిత్రం ‘@నర్తనశాల’. ఐరా క్రియేషన్స్ పతాకం ఫై నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రధానంగా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందింది. కాగా ఈ చిత్రం ఆగష్టు 30న విడుదల అవ్వబోతుంది. ఈ సంధర్బంగా ఈ చిత్ర హీరో నాగశౌర్య మీడియా తో మాట్లాడారు. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం..

‘నర్తనశాల’ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదలకి ఏమైనా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారా ?
అలాంటిది ఏమి లేదు. ఎందుకంటే మేము ఏమి చేసామో, ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో మాకు తెలుసు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని చాలా బలంగా నమ్ముతున్నాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ప్రేక్షకుల స్పందన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.

మీరు ఈ చిత్రంలో ‘గే’గా నటిస్తున్నారని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అసలు మీ పాత్ర గురించి చెప్పండి?
నేను మొదటిసారి నా పరిధి మేరకు ఓ వైవిధ్యమైన పాత్రలో నటించాను. ఆడవారికి అండగా నిలబడే వ్యక్తిగా, వారిని రక్షించే వ్యక్తిగా ఈ సినిమాలో కనిపిస్తాను. నా పాత్ర గురించి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. కొంచెం గే షేడ్స్ కలిగి ఉంటుంది.

‘ఛలో’ లాంటి మంచి సక్సెస్ వచ్చాక, మీరు ఇలాంటి చాలెంజింగ్ రోల్ లో నటించడం రిస్క్ అనిపించలేదా ?
రిస్క్ ఏమి లేదండి. నర్తనశాల స్క్రిప్ట్ వింటున్నప్పుడే నేను నా పాత్రను బాగా ఎంజాయ్ చేశాను. రేపు ఆడియన్స్ కూడా సేమ్ నాలాగే ఎంజాయ్ చేస్తారు. నిజానికి నేను ‘గే’ పాత్రను అంగీకరించే ముందు అసలు దాని గురించి ప్రత్యేకంగా ఏమి ఆలోచించలేదు. ఒక నటుడిగా, నేను ఎలాంటి పాత్రను అయినా చేసేలా ఉండాలి అన్నది ఒక్కటే ఆలోచించాను.

మీ దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి గురించి చెప్పండి ?
శ్రీనివాస్ ను డైరెక్టర్ గా మా బ్యానర్ నుండి మేం పరిచయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. 2013లో తను నాకు ఈ స్క్రిప్ట్ చెప్పటం జరిగింది. అయితే ముందు ఒప్పుకున్న కొన్ని సినిమాల కారణంగా ఈ సినిమా చెయ్యటానికి ఆలస్యం అయింది. ఈ మధ్యలో శ్రీనివాస్ ఈ స్క్రిప్ట్ మీద చాలా బాగా వర్క్ చేశాడు. ఇక నా విషయానికి వస్తే నేను కొత్త దర్శకులతో పని చేయడం చాలా సౌకర్యవంతంగా ఫీల్ అవుతాను. భవిష్యత్తులో ఇలాగే కొత్త డైరెక్టర్ లతో కూడా వర్క్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.

మీ బ్యానర్ లో నటించడానికి, ఇతర నిర్మాణ సంస్థల్లో నటించడానికి మీకు ఏమైనా వ్యత్యాసం కనిపిస్తోందా ?
నటించేటప్పుడు మా బ్యానరా, వేరే బ్యానరా లాంటి వ్యత్యాసాలు ఏమి ఉండవండి. ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడతాను. కాకపోతే చిన్న తేడా ఏమిటంటే, మా బ్యానర్లో సినిమా చేస్తే నేను ప్రీ ప్రొడక్షన్ దగ్గరనుంచీ పూర్తిగా ఇన్ వాల్వ్ అవుతాను. బయటి బ్యానర్లలో ఆలా సాధ్యం కాదు కదా.

మీ నిర్మాణ సంస్థలో మీరు కాకుండా, ఇతర హీరోలతో కూడా సినిమాలు చేసే ఆలోచన ఉందా ?
ఖచ్చితంగా చేస్తాం. అందుకు సంబధించిన ప్రణాళిక కూడా మా దగ్గర ఉంది. కానీ ఏదైనా స్క్రిప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మాకు నచ్చిన స్క్రిప్ట్, ఏ హీరోని కోరితే, వారితోనే సినిమా చేయడానికి ప్రయత్నిస్తాం.

మీ తదుపరి ప్రాజెక్టులు గురించి చెప్పండి ?
భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ‘నారి నారి నడుమ మురారి’ అనే చిత్రం చేస్తున్నాను. అది కాకుండా మా ఇరా క్రియేషన్స్ బ్యానర్ లోనే మరో కొత్త డైరెక్టర్ రమణ తేజను డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను. వీటితో పాటు నన్ను హీరోని చేసిన నా మొదటి నిర్మాత సాయి కొర్రపాటిగారి నిర్మాణంలో కూడా మరో సినిమా ఉంటుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook