మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, కయదు లోహర్ జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ మూవీని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ నెల 10న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది.
ఈ సినిమాలో బలం, ఆధిపత్యం ప్రదర్శించే పాత్ర కోసం ప్రత్యేకంగా బరువు పెరిగి, కొత్త లుక్‌లోకి మారినట్లు హీరో టొవినో తెలిపారు. 1950ల నాటి కేరళ సామాజిక పరిస్థితుల స్ఫూర్తితో తెరకెక్కిన ఫిక్షనల్ కథ ఇదని ఆయన చెప్పారు. ఏ మతాన్ని కించపరచకుండా, అందరూ సమానమే అని, మానవత్వమే గొప్పదనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు. కుటుంబ సమేతంగా చూసి ఆస్వాదించదగ్గ బ్యూటిఫుల్ ఎమోషనల్ సినిమా ఇదని, జేక్స్ బిజోయ్ సంగీతం సినిమా ఇంటెన్సిటీని పెంచిందని ఆయన పేర్కొన్నారు.
హీరోయిన్ కయదు లోహర్ మాట్లాడుతూ.. ఇందులో తను ‘రెబెకా’ అనే ఇంటెలెక్చువల్, రూటెడ్ పాత్రలో రెండు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలిపారు. గ్లామర్‌కు దూరంగా ఉండే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్స్ చేసి మరీ నటించానని చెప్పారు. టొవినో అద్భుతమైన నటన తనను ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని ఆమె అన్నారు. ఎలాంటి దాపరికాలు, అజెండాలు లేని ఈ స్వచ్ఛమైన సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.


