
ఇండియన్ సినిమాల్లో ఐఫా అవార్డులకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ పేరుతో 2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ అవార్డులు ఇండియన్ సినిమా అవార్డులంటే ఉండే క్రేజ్‌ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇక ఇప్పటివరకూ బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఐఫా వేడుక మొదటి సారిగా సౌతిండియన్ సినిమానూ పలకరించేందుకు సిద్ధమవుతోంది. సౌతిండియన్ సినిమాలైన తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ ఇలా నాలుగు భాషలకు చెందిన సినీ ప్రముఖుల సమక్షంలో ఐఫా ఉత్సవం జరగనుంది.
డిసెంబర్ 6నుంచి మూడు రోజుల పాటు హైద్రాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఐఫా ఉత్సవం జరగనుంది. ఈ వేడుకకు టాప్ స్టార్స్ హాజరు కావడంతో పాటు ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహించే దిశగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉదయం హైద్రాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఐఫా ఉత్సవంనకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు సినీ ప్రముఖులు నాగార్జున, అల్లు అరవింద్, కమల్ హాసన్, వెంకటేష్, అల్లు శిరీష్, తమన్నా తదితరులు హాజరై ఐఫా ఉత్సవం హైద్రాబాద్‌లో జరగనుండడం సంతోషకరమని తెలిపారు. ఈ ఉత్సవాన్ని అన్ని విధాలా ది బెస్ట్ అనిపించేలా చేసేందుకు సంస్థ పరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని ఐఫా ఈ సందర్భంగా ప్రకటించింది.