
‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ సినిమాలతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్, తాజాగా సునీల్‌తో ఓ సినిమా చేయనున్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటివరకూ అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే పరుచూరి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసమే మరో ఆసక్తికర టైటిల్‌ను రిజిస్టర్ చేయించారని కూడా తెలుస్తోంది.
క్రాంతి మాధవ్ గత సినిమాల పేర్లలానే ఈసారి కూడా అచ్చ తెలుగు టైటిల్ ఉండనుందట. ‘సంతోషం సగం బలం’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సునీల్ వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయారు. సునీల్, ‘జోష్’ ఫేం వాసువర్మ దర్శకత్వంలో ఓ సినిమా, వంశీ ఆకెళ్ళ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.

