ఇంటర్వ్యూ : అల్లరి నరేష్ – ‘బందిపోటు’ అన్ని సెంటర్ ఆడియన్స్ కి నచ్చే సినిమా.!

ఇంటర్వ్యూ : అల్లరి నరేష్ – ‘బందిపోటు’ అన్ని సెంటర్ ఆడియన్స్ కి నచ్చే సినిమా.!

Published on Jun 30, 2014 12:00 PM IST

Allari_Naresh
కామెడీ మూవీస్ స్పెషలిస్ట్ ఈవివి సత్యనారాయణ తన చిన్న తనయున్ని డైరెక్టర్ చేయబోతే అనుకోకుండా నటుడై ప్రేక్షకులను తెగ నవ్విస్తున్న హీరో అల్లరి నరేష్. అటు కామెడీతోనే కాకుండా అప్పుడప్పుడు విభిన్న తరహా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మదిలో బాగా గుర్తుండి పోయిన అల్లరి నరేష్ 35వ ఏట అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ చిన్ని కృష్ణ, మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమాల్లో నటిస్తున్నాడు. తన తదుపరి సినిమాల ప్రణాళికలు, మరియు మరిన్ని విశేషాలను మాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ముందుగా ఈ బర్త్ డే స్పెషల్ ఏంటి?

స) ఈ బర్త్ డే సంథింగ్ స్పెషల్. ఎందుకంటే నాన్నగారి ప్రొడక్షన్ హౌస్ ని మళ్ళీ తిరిగి ప్రారంభించబోతున్నాను. నాన్నగారి టైంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాను, ఇకపై నేను అన్నయ్య రాజేష్ కలిసి నిర్మించనున్నాం. ఈ ప్రొడక్షన్ లో మొదటి చిత్రంగా ‘బందిపోటు’ని ప్రారంభించాం. మా బ్యానర్ లో ప్రతి సంవత్సరం 3 సినిమాలు ఉంటాయి. అందులో ఒక దానిలో నేను నటిస్తాను, మిగతా రెండింటిలో బయటి హీరోలు నటిస్తారు.

ప్రశ్న) మరి ‘బందిపోటు’ ఎలా ఉంటుంది.?

స) ‘బందిపోటు’ సినిమా ‘రాబిన్ హుడ్’ తరహాలో ఉంటుంది. దొంగల్ని దోచుకో అనే కాన్సెప్ట్ తో ఉంటుంది. ఇంద్రగంటి గారు చెప్పగానే బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ సినిమాకి ఓకే చెప్పాను. మాములుగా అయన సినిమాలంటే ఎ సెంటర్స్ కే పరిమితం అంటారు, కానీ కామెడీ మూవీ మాత్రం ఎ,బి,సి సెంటర్స్ అందరూ చూడదగిన సినిమా. జూలై మొదటి వారం నుంచి రాజమండ్రిలో షూటింగ్ మొదలు పెడుతున్నాం.

ప్రశ్న) ఈ మధ్య కాలంలో మీరు ఎంతో కష్టపడి చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలా అయినప్పుడు మీరెలా తీసుకుంటారు.?

స) సినిమా ఇండస్ట్రీలో రెండే ఉంటాయండి, ఒకటి హిట్, రెండు ఫ్లాప్, ఇవి తప్ప వేరే కోణం ఉండదు. ప్రతి సినిమాని ఎంతో కష్టపడి చేస్తాం. కానీ కొన్ని ఆడవు. అప్పుడు మనం చేయాల్సింది ఆ సినిమాలో ఏం తప్పులు చేసామో తెలుసుకొని వారిని తరువాతి సినిమాలో రిపీట్ కాకుండా చూసుకోవాలి. లడ్డూబాబు సినిమా కోసం బాగా కష్టపడ్డాను కానీ అది ఏ తరహా సినిమా అనేది ముందే ఆడియన్స్ కి చెప్పకపోవడం వల్ల పూర్తి కామెడీ ఎంటర్టైనర్ అనుకొని వచ్చి నిరుత్సాహానికి గురయ్యారు. ‘ఇక్కడ జయాపజయాలు అనేవి కామన్ మనం సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి’ అని నాన్నగారు చెప్పేవారు. ప్రతి ఫెయిల్యూర్ ఒక అనుభవం.

ప్రశ్న) ఈవివి గారు తన ప్రొడక్షన్ లో కొత్త నటీనటులకి అవకాశం ఇచ్చేవారు. మరి మీరు కూడా అదే రూల్ ఫాలో అవుతారా.?

స) అవును. మేము కూడా కొత్త వారిని మా సినిమాల ద్వారా పరిచయం చేస్తాం. ఉదాహరణకి బందిపోటు సినిమాతో నటుడిగా సంపూర్నేష్ బాబుని పరిచయం చేస్తున్నాం. ఇంద్రగంటి కూడా కొత్త వారిని ఎంకరేజ్ చేస్తారు. ‘బందిపోటు’లో కూడా కొంతమంది కొత్త వారు నటిస్తున్నారు. అలాగే నా తదుపరి ప్రొడక్షన్స్ లో కొత్త కమెడియన్స్, నటీనటుల్ని కూడా పరిచయం చేస్తున్నాం. మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసిన వారికి కూడా ఆఫర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం.

ప్రశ్న) చిన్ని కృష్ణ సినిమాలో కార్తీక మీ సిస్టర్ గా నటిస్తోందని విన్నాం. ఆ విశేషాలు చెబుతారా.?

స) అవునండి కార్తీక చిన్ని కృష్ణ సినిమాలో సిస్టర్ రోల్ చేస్తోంది. కానీ మనం ఇప్పటి వరకూ ‘పుట్టింటికి రా చెల్లి’, ‘రాఖీ’ లాంటి సినిమాల్లో సీరియస్ రోల్స్ చూసాం. కానీ ఇందులో మాత్రం ఇలాంటి సిస్టర్ నాకు వద్దురా బాబోయ్ అనేలా తన పాత్ర ఉంటుంది. ఇందులో నాకు కార్తీక ట్విన్ సిస్టర్ గా కనపడుతుంది.

ప్రశ్న) మీ ఫాదర్ గారి సినిమాలను ఏవైనా రీమేక్ చేస్తారా?

స) నేను నాన్నగారు కలిసి మూడు సినిమాలకి సీక్వెల్ చేయాలనుకున్నాం. అవే ‘జంబలకిడి పంబ’, ‘ఆలీబాబా అరడజను దొంగలు’, ‘ఆ ఒక్కటీ అడక్కు’. కానీ ఇప్పుడు ఏ సినిమా ముట్టుకున్న క్లాసిక్ అనిపిస్తోంది. అందుకే వాటిని క్లాసిక్స్ లానే వదిలేద్దాం, వాటి పేరు చెడగొట్టడం ఎందుకని నిర్ణయించుకున్నాం. అందుకే కొత్త తరహా సినిమాలు ట్రై చేద్దాం అని నిర్ణయించుకున్నాం.

ప్రశ్న) ఈ మధ్య కాలంలో సినిమాలను బాగా తగ్గించినట్టున్నారు? అలాగే మల్టీ స్టారర్ సినిమాలు వస్తే చేస్తారా?

స) అవునండి.. కొన్ని సినిమాల వల్ల కౌంట్ తగ్గింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా అదే అడుగుతున్నారు. అందుకే మళ్ళీ స్పీడ్ పెంచాను. ఈ సంవత్సరం మొత్తం 5 సినిమాలు వస్తాయి. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంకో 3 సినిమాలు రిలీజ్ అవుతాయి. అలాగే ఇక నుంచి చేయబోయే సినిమాలను కూడా 65(టాకీ పార్ట్ కి 45 డేస్, పాటలకి 20డేస్) రోజుల్లో ఫినిష్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను.

మల్టీ స్టారర్ అంటే నేను ఎప్పుడూ సిద్దమే.. నా సెకండ్ సినిమానే మల్టీ స్టారర్. ఎలాంటి పాత్ర వచ్చినా నేను చెయ్యడానికి రెడీ. కానీ నిర్మాతలే అల్లరి నరేష్ అంటే నవ్విస్తాడు, నెగటివ్ షేడ్స్ ఎంతవరకూ చేస్తాడో అని ఆలోచిస్తున్నారు.

ప్రశ్న) మీకు ఇచ్చిన ‘అల్లరి’ టైటిల్ ని ఇలానే కంటిన్యూ చేస్తారా?

స) అల్లరి అనేది మీము ఆలోచించి పెట్టింది కాదు. ‘ధనలక్ష్మీ ఐ లవ్ యు’ సినిమాలో ఇద్దరం నరేష్ లు ఉన్నామని ముందు అల్లరి పెట్టారు. అది అలానే కంటిన్యూ అయ్యింది. నా 90 ఏళ్ళ వయసులో కూడా అల్లరోడు అనే పేరు చెప్పుకోవడానికి బాగుంటుంది కదా..

అంతటితో అల్లరి నరేష్ కి అడ్వాన్స్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి మా ఇంటర్వ్యూని ముగించాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు