
హీరోయిన్‌గా చాలా సినిమాలతో మెప్పించిన ఛార్మీ, అప్పుడప్పుడు పూర్తి స్థాయి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా కనిపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె నిర్మాత అవతారం కూడా ఎత్తి ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాను నిర్మించారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం (జూన్ 12న) పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా ఛార్మీతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా గురించి చెప్పండి?
స) ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా గురించి సింపుల్‌గా చెప్పాలంటే.. ఇదో రొటీన్‌కి భిన్నమైన లవ్‌స్టోరీ లాంటిది. ఒక వ్యభిచారిని ఓ యువకుడు ప్రేమించడం, పెళ్ళి చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో వచ్చిన సమస్యలు, ఒక సీరియస్ విషయంపై జ్యోతిలక్ష్మీ పోరాడడం.. ఇలా నడుస్తుందీ కథ. ఆ సీరియస్ ఇష్యూ ఏంటన్నది మీరే తెరపై చూడాలి. ఈ సినిమా చూసిన తర్వాత జోతిలక్ష్మీని ప్రేమించకుండా ఉండలేరు. ప్రతిఒక్కరూ జ్యోతిలక్ష్మీని ప్రేమిస్తారు. ఈ సినిమా ద్వారా మొదటిసారి నిర్మాతగానూ మారా. అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ గురించి పూర్తిగా చెప్పండి?
స) ఈ సినిమాలో నేను ఓ వ్యభిచారిగా కనిపిస్తా. కథ ముందుకు వెళుతున్నా కొద్దీ ఒక్కో విధంగా మారిపోయే జ్యోతిలక్ష్మీని చూస్తారు. పూరీ జగన్నాథ్ గారు ఈ సినిమా గురించి చెబుతూ జ్యోతిలక్ష్మీ పాత్ర కోసం బరువు తగ్గమన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఈ సినిమా కోసం 11 కేజీల బరువు తగ్గాను. జ్యోతిలక్ష్మీ పాత్ర వ్యభిచారి అయినా ఇందులో ఎక్కడా సెక్స్ సన్నివేశం లేదు.
ప్రశ్న) సడెన్‌గా నిర్మాతగా అవతారమెత్తారు. నిర్మాతగా మారాక ఎలా ఉంది?
స) ఈ సినిమా గురించి పూరీ గారు చెప్పునప్పుడే, నేనూ ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వాలనుకున్నా. నా సొంతంగా నేనే ఈ డిసిషన్ తీసుకున్నా. నటిగా ఇన్నేళ్ళుగా కొనసాగుతున్నా దొరకని కిక్, నిర్మాతగా మారాక దొరికింది. సినిమా నిర్మాణంలో సూపర్ కిక్ ఉంది. సినిమా గురించి ప్రతీ అంశం దగ్గరనుండి చూశా. చాలా కొత్తగా ఉందీ అనుభవం. ఈ సినిమా మరో నిర్మాత సి.కళ్యాణ్ గారి నుంచి కూడా చాలా నేర్చుకున్నా.
ప్రశ్న) ప్రొడక్షన్‌లో అనవసర ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు?
స) ప్రీ ప్రొడక్షన్‌లోనే ప్రతీ విషయాన్నీ సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ప్రొడక్షన్ ఖర్చు సగం తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో పూరీ జగన్నాథ్ గారి ప్లానింగ్ అద్భుతం. పక్కా ప్లాన్ ప్రకారం చేసాం కాబట్టే ఈ సినిమాను కేవలం 37 రోజుల్లో పూర్తి చేయగలిగాం.
ప్రశ్న) దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి చెప్పండి?
స) పూరీ జగన్నాథ్ లాంటి దర్శకుడిని మరొకరిని చూడలేం. ఆయనదో ప్రత్యేక శైలి. ఒక సినిమా విడుదలైన రోజే ఇంకో సినిమాకు ముహూర్తం పెట్టేస్తారు. ఇంత స్పీడ్‌గా సినిమా తీసేవారిని నేనైతే ఎప్పుడూ చూడలేదు. స్క్రిప్ట్‌పై ఆయనకు మంచి పట్టు ఉంది. ప్రతి సన్నివేశాన్నీ క్లారిటీతో తన స్టైల్లోనే చెప్పడం నాకు బాగా నచ్చే విషయం.
ప్రశ్న) సినిమాను ఎవరికైనా చూపించారా?
స) నిన్ననే సినిమాను కొంత మంది మిత్రులకు చూపించాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ సినిమా బాగా వచ్చిందని అంటూంటే చాలా సంతోషంగా అనిపించింది. రాత్రి నుంచి నా మెసేజ్ బాక్స్ నిండా అభినందనలే. ఈ రెస్పాన్స్ చూశాక నాకైతే కళ్ళనుంచి నీళ్ళు వచ్చేశాయి. రేపు ప్రేక్షకుల నుంచి కూడా ఇదే రెస్పాన్ వస్తుందని అనుకుంటున్నా.
ప్రశ్న) ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?
స) ఈ సినిమాకు మేజర్ హైలైట్ అంటే కథే. ప్రస్తుతం సమాజంలో జరిగే ఒక ఇష్యూపై ఓ అమ్మాయి చేసే పోరాటం ఈ సినిమాకు మరో హైలైట్. ‘జ్యోతిలక్ష్మీ’ సినిమా చూశాక ప్రతిఒక్కరూ తమ ఇంట్లో జ్యోతిలక్ష్మీ లాంటి మనోబలం ఉన్న అమ్మాయి ఉండాలని కోరుకుంటారు.
ప్రశ్న) ఇప్పటివరకూ మీ కెరీర్ ఎలాంటి అనుభూతినిచ్చింది?
స) చాలా బాగుంది. 13 ఏళ్ళకే ఇండస్ట్రీకి వచ్చా. మొదట్లో ఏదీ పెద్దగా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు సినిమాపై మంచి అవగాహన ఉంది. నా కెరీరైతే ఇప్పటివరకూ చాలా ప్రశాంతంగా సాగుతూ వచ్చింది. ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోవడం, ఓవర్ నైట్‌లో ఫేడ్ అవుట్ అయిపోవడం లాంటివి ఇప్పటికైతే జరగలేదు.
ప్రశ్న) ‘జ్యోతిలక్ష్మీ 2’ ఎప్పుడు మొదలవుతుంది?
స) అప్పుడే జ్యోతిలక్ష్మీ 2 గురించి మాట్లాడుతున్నారా! ఈ సినిమా రిలీజ్ కావాలి. పూరీ జగన్నాథ్ గారు ఎంత బిజీగా ఉంటారో తెలుసు కదా? ఆయన ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి. దానికి ఇంకా చాలా టైమ్ ఉందనుకుంటా!

