ఇంటర్వ్యూ : జేడీ చక్రవర్తి – నాకు నచ్చితేనే ఏ సినిమాలో అయినా నటిస్తా!

ఇంటర్వ్యూ : జేడీ చక్రవర్తి – నాకు నచ్చితేనే ఏ సినిమాలో అయినా నటిస్తా!

Published on Sep 3, 2015 6:31 PM IST

j,d-chakravathi
జేడీ చక్రవర్తి.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినీ సంచలనం ‘శివ’తో నటుడిగా పరిచయమై, ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా విభిన్న పాత్రల్లో మెప్పించిన వ్యక్తి. గత కొన్నాళ్ళుగా విలన్ తరహా పాత్రలతో బాగా ఆకట్టుకుంటోన్న జేడీ, తాజాగా హీరో విష్ణు – దర్శకుడు దేవ కట్టాల కాంబినేషన్‌లో రూపొందిన ‘డైనమైట్‌’ ద్వారా అలరించేందుకు సిద్ధమయ్యారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 4న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) తమిళ సినిమా ‘అరిమ నంబి’లో చేసిన అదే పాత్రను రీమేక్‌ అయిన ‘డైనమైట్‌’లోనూ మీరే చేశారు. చేసిన పాత్రనే రెండోసారి చేయడం బోర్ అనిపించదా?

స) మీరన్నది నిజమే.. ఎందుకంటే తమిళ సినిమా ‘అరిమ నంబి’లో నా పాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దానికి రీమేక్‌గా వచ్చిన ‘డైనమైట్’లో కూడా నేనే నటిస్తే బాగుంటుందని దర్శకుడు దేవ కట్టా నన్ను కలిశాడు. అయితే చేసిన పాత్రనే మళ్ళీ చేయడం నాకు బోరింగ్. అందుకే మొదట ఈ సినిమాలో నటించనని చెప్పా. దర్శకుడు మాత్రం నేనే చేయాలని పట్టుబట్టి తెలుగు రీమేక్ కోసం చేసిన మార్పులు చెప్పాడు. నాకు ఈ చేంజెస్ చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత వెంటనే ఓకే చేసేశా.

ప్రశ్న) తమిళ ‘అరిమ నంబి’ అయినా, తెలుగు ‘డైనమైట్’ అయినా.. ఈ కథలో మీకేం నచ్చింది?

స) ఇది స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా. ట్రీట్‌మెంట్ చాలా కొత్తగా ఉంటుంది. హీరో, విలన్ ఒకరినొకరు కలుసుకోకున్నా వారిద్దరి మధ్యన జరిగే ఈ గేమ్ నాకు మొదటిసారి విన్నప్పుడే విపరీతంగా నచ్చేసింది. ఇక నేను అరిమ నంబి చూశాక, ఆ సినిమాలో ఏమేం మైనస్ అనుకున్నానో అవన్నీ ఇక్కడి వర్షన్‌లో దేవకట్టా చేంజ్ చేశాడు. దీంతో ‘అరిమ నంబి’ కంటే ఈ డైనమైట్ సినిమా ఇంకా బాగా ఆకట్టుకుంటుందన్న నమ్మకం కలిగింది.

ప్రశ్న) దర్శకుడు దేవకట్టా ఈ రీమేక్‌ను ఎలా హ్యాండిల్ చేశారో చెప్పండి?

స) దేవకట్టా బాగా చదువుకున్న వ్యక్తి. సినిమాలో ఎమోషన్ ఎలా పండాలన్నది అతనికి సరిగ్గా తెలుసు. నేను ఈ రీమేక్‌లో ఏమేం మార్పులు చేయొచ్చని భావించానో అవన్నీ ముందే చేంజ్ చేసి పెట్టుకున్నాడు. సినిమా పట్ల అతడికున్న డెడికేషన్ సాధారణమైనది కాదు. ఇక విష్ణు – దేవకట్టాల కెమిస్ట్రీ, వాళ్ళ డెడికేషన్ ఈ సినిమాకు మేజర్ హైలైట్.

ప్రశ్న) హీరో విష్ణుతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

స) విష్ణు.. ఒక సినిమా బాగా రావడానికి ఎంతైనా కష్టపడే నటుడు. ఒక పాత్ర కోసం ఎన్ని సాహసాలైనా చేస్తాడు. సాధారణంగా హీరో అంటే తనకే పూర్తి ప్రాధాన్యత ఉండాలని కోరుకునే వారు కొందరుంటారు. విష్ణుకు మాత్రం సినిమా బాగా రావాలన్నదే మెయిన్ టార్గెట్. నాకు తెలిసి ఇప్పుడున్న హీరోలంతా ఈ చేంజ్‌ను అప్పుడే అందిపుచ్చుకున్నారనిపిస్తోంది.

ప్రశ్న) స్వతహాగా దర్శకుడు కూడా అయిన మీరు, ఇతర దర్శకుల సినిమాల్లో నటించేప్పుడు వారికేమైనా సలహాలు ఇస్తుంటారా?

స) క్రియేటివ్ విషయాల పరంగా అస్సలు జోక్యం చేసుకోను. అది మంచిది కాదు కూడా. అయితే ఒక పాత్ర చేస్తున్నపుడు ఏయే విషయాలు ఇంకా బాగా ఉండొచ్చని నాకనిపిస్తుందో వాటి గురించి మాత్రం చెబుతుంటా.

ప్రశ్న) ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేసినట్లు కనిపించడం లేదు. ఎందుకలా?

స) ఈ మధ్య కాలంలో నేను తెలుగులో సినిమాలు చేయలేదోమో! ఈ గ్యాప్ లో తమిళ, మలయాళ భాషల్లో రెండు, మూడు సినిమాలు చేశా. ముందుగా నేను ఏదైనా సినిమా ఒప్పుకోవాలంటే నాకు ఆ పాత్ర నచ్చాలి. నాకు నచ్చితేనే నేను సినిమా చేస్తా. అందుకనే తమిళం, మళయాలంలో రెండు పెద్ద హిట్ సినిమాల్లో నటించాక కూడా నేను పెద్దగా సినిమాలు చేసింది లేదు.

ప్రశ్న) మీ తదుపరి ప్రాజెక్టులేంటి?

స) ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్‌లో నా దర్శకత్వంలో ఓ సినిమా డిస్కషన్‌లో ఉంది. అలాగే వర్మగారి దర్శకత్వంలో రూపొందే మరో సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నా. తమిళంలో ‘జీరో’ అనే ఒక సినిమా, ‘భాస్కర్ ది రాస్కెల్’ తెలుగు రీమేక్.. ఇలా కొన్ని లైన్లో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు