‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ అనే ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్ధసాని(డాలీ). డాలీ చేసింది ఇప్పటి వరకూ 3 సినిమాలే అందులో రెండు మల్టీ స్టారర్ సినిమాలు అవ్వడం విశేషం. తడాఖా సినిమా కమర్షియల్ పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత డాలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ లతో చేసిన ‘గోపాల గోపాల’ జనవరి 10న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మేము డాలీతో కాసేపు చిట్ చాట్ చేసాం. ఆ విశేషాలు మీకోసం…
ప్రశ్న) ప్రేక్షకులతో కలిసి సినిమా చూసారా.? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది.?
స) విడుదలైన రోజు నుంచి ప్రేక్షకులతో కలిసి సినిమాలు చేస్తూనే ఉన్నాను. థియేటర్స్ లో ఆడియన్స్ రెస్పాన్స్ చాలా సూపర్బ్ గా ఉంది. రోజు రోజుకీ ఆ క్రేజ్ పెరుగుతోంది. చెప్పాలంటే థియేటర్స్ లో నన్ను గుర్తు పడుతున్నారు. రిలీజ్ తర్వాత నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఫ్యామిలీ నుంచి.. వాళ్ళ ఇంట్లో ఉన్న మొత్తం 53 మంది ఈ సినిమాకి వెళ్ళారు. అందులో చిన్న పిల్లల నుండి 70 సంవత్సరాల వయసు వారు కూడా ఉన్నారు. అందరికీ ఈ సినిమా నచ్చిందని చాలా బాగా తీసానని అంటుంటే చాలా ఆనందం వేసింది.
ప్రశ్న) అసలు ముందుగా ఈ కథతో మీరు వెంకటేష్ ని అప్రోచ్ అయ్యారా లేక వాళ్ళే మిమ్మల్ని అపోర్చ్ అయ్యారా.?
స) వెంకటేష్ బాబుకి ఈ సినిమా బాగా నచ్చింది. ఆయన ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు. అదే టైంలో నేను సురేష్ బాబు – వెంకటేష్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు అనుకోకుండా ఈ సినిమా చూసిన నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు నేనే వాళ్ళని ఈ సినిమా చేద్దామని అడగడానే ఒప్పుకున్నారు. తర్వాత 6 నెలలు స్క్రిప్ట్ వర్క్ చేసి సెట్స్ పైకి వెళ్లాం.
ప్రశ్న) మరి శ్రీ కృష్ణుడి పాత్రకి పవన్ కళ్యాణ్ ని తీసుకురావడం ఎవరి ఆలోచన.?
స) పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రాజెక్ట్ లో తీసుకురావడం అందరి ఆలోచన.. ఎందుకు అంటే టాలీవుడ్ లో మనం ఒక దేవుడి పాత్రని ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు చూపిస్తున్నాం అంటే ఆ పాత్ర చేసే హీరో నిజంగా దేవుడే అని అందరూ నమ్మగలిగేలా ఉండాలి. సీనియర్ ఎన్.టి.ఆర్ ని మనం దేవుడిగా చూసాం, ఆయనే దేవుడని ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు అలాంటి పాత్ర ఎవరన్నా చెయ్యాలి అంటే తెలుగు సినీ అభిమానుల్లో ఆల్రెడీ దేవుడు అని పిలుచుకునే హీరో ఉండాలి. ఆ హీరోనే మా పవన్ కళ్యాణ్. అందుకే ఆయన్ని తీసుకున్నాం. ఆయన కూడా పాత్రని ఎంతో నిష్టగా చేసాడు.
ప్రశ్న) మొదటి సారి ఇద్దరు స్టార్ హీరోస్ తో పనిచేయడం ఎలా అనిపించింది.? షూటింగ్ టైంలో బాగా టెన్షన్ పీలయ్యారు.?
స) అస్సలు ఎక్కడా టెన్షన్ పడలేదు అండి.. అలాగే అందరూ అనుకుంటారు వెంకటేష్ – పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోస్ తో సినిమా చేయాలని కానీ ఆ అదృష్టం నాకు లబించింది. ఆ విషయంలో ఆనందంగా ఉన్నాను. ఇద్దరూ ఎంతో సహకరించి ఈ సినిమా చేసారు. మామూలుగా మన హీరోలు ఎంతో మంది నటులు తమ పాత్ర కోసం ఎంతో కష్టపడి చేస్తారు. కానీ అనుకున్న పాత్రలో జీవించే నటులు అరుదుగా కనపడుతుంటారు. ఆ అరుదైన వారిలో పవన్ కూడా ఒకరు. ఆయన ఎంతో డెడికేషన్ తో ఈ పాత్ర చేసారు.
ప్రశ్న) ఈ సినిమా రీమేక్ చెయ్యాలనుకున్నప్పుడు మీరు మొదటగా స్క్రిప్ట్ లో చేయాలనుకున్న మార్పులు ఏమిటి.?
స) బాలీవుడ్ లో చేసిన ఓ మై గాడ్ నాకు బాగా నచ్చింది. కానీ నాకు ప్రీ క్లైమాక్స్ పెద్దగా నచ్చలేదు. ప్రీ క్లైమాక్స్ లో దేవుడు వల్ల పెరాలసిస్ వచ్చిందని చూపించడం నాకు, నా టీంకి నచ్చలేదు. అందుకే దేవుడు భక్తులని ప్రేమిస్తాడు, అలా వ్యాధి గ్రస్తున్ని చెయ్యడు. అందుకే నేను తెలుగులో మార్చేసాను. ఒక స్వామీజీని గుడ్డిగా నమ్మే భక్తుడు తమ దేవుణ్ణి అవమానించాడని పొడవటంలో లాజిక్ ఉంది. ఇంకా చాలా మార్పులు చేసాను. ఓవరాల్ గా నేను అనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి కరెక్ట్ గా చెప్పడంలో సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉన్నాను.
ప్రశ్న) డైరెక్షన్ తో పాటే డైలాగ్స్ మరియు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళ గురించి కాస్త చెబుతారా.?
స) చెప్పాలంటే నేను అనుకున్నది వచ్చే దాకా రైటర్స్ చేత చాలా వెర్షన్స్ రాయిస్తాను. అలా సాయి మాధవ్ దగ్గర కూడా చాలా వెర్షన్స్ రాయించాను. చివరికి ఏ డైలాగ్స్ సీన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయో అవే ఎంచుకున్నాం. ఆ విషయంలో నేను సాయి మాధవ్ కి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఇక అనూప్ పరిస్థతి కూడా అంతే.. ఎంతో ఓపిగ్గా నాకు కావాల్సిన ట్యూన్స్ ఇచ్చాడు. థాంక్స్ అనూప్..
ప్రశ్న) వరసగా రీమేక్ మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. రీమేక్ మార్క్ డైరెక్టర్ అని బ్రాండ్ ఏమన్నా వేసుకోవాలనుకుంటున్నారా.?
స) అలా ఏమీ అనుకోవడం లేదు. అవి అనుకోకుండా జరిగినవి. అందుకే ఆ ముద్ర పడకుండా నా నెక్స్ట్ సినిమా కచ్చితంగా సొంత స్టొరీతో చేస్తాను. మీరన్నట్టు ఒకవేళ రీమేక్ డైరెక్టర్ అనే ముద్ర పడినా పర్లేదు ఎందుకంటే మంచి సినిమాలనే అందించాను కాబట్టి.
ప్రశ్న) ఆడియో లాంచ్ లో పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాకి మీరే డైరెక్టర్ అన్నారు. ఆ సినిమా పరిస్థితి ఏమిటి.?
స) అవును.. నా తదుపరి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే ఉంటుంది. ప్రస్తుతం ‘గోపాల గోపాల’ ప్రమోషన్స్ లోబిజీగా ఉన్నాను. అవి పూర్తయ్యాక పవన్ సినిమా స్క్రిప్ట్ పై కూర్చుంటాను.
అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి.. గోపాల గోపాల మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి, తదుపరి సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పాము.


