ఇంటర్వ్యూ : కొరటాల శివ – కథను దాటి ఏదో చెప్పాలని ఎప్పుడూ ప్రయత్నించను!

31st, August 2016 - 12:20:17 AM

kalatala-siva
దర్శకుడు కొరటాల శివ రెండే రెండు సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ చాటిచెప్పుకున్నారు. మొదటి సినిమా ’మిర్చి’తో వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ అని, రెండో సినిమా ’శ్రీమంతుడు’తో ’ఊరిని దత్తత్ తీసుకోవడం’ అని ఇలా సరికొత్త కథలనే కమర్షియల్ సినిమాలుగా మలిచి సూపర్ హిట్స్ కొట్టిన కొరటాల, ఇప్పుడు తాజాగా ’జనతా గ్యారెజ్’ అంటూ వస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 1న) పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా గురించి కొరటాల శివ చెప్పిన విశేషాలు..

ప్రశ్న) శ్రీమంతుడు లాంటి బ్లాక్‍బస్టర్ తర్వాత వస్తున్నారు. టెన్షన్ ఫీలవుతున్నారా?

స) టెన్షన్ అయితే ఏ సినిమా విడుదలప్పుడైనా ఉంటుంది. సినిమాను ప్రేక్షకుల ఎలా రిసీవ్ చేసుకుంటారూ? అన్న టెన్షన్ ఉంది. ఒక మంచి సినిమా తీశానన్న నమ్మకం ఉంది. రేపు ప్రేక్షకుల దగ్గర్నుంచి కూడా ఆ మాట వినిపిస్తే హ్యాపీ!

ప్రశ్న) రెండు వరుస విజయాల తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం అందించాలన్న క్రమంలో జనతా గ్యారెజ్ తెరకెక్కించేప్పుడు ఒత్తిడి అనిపించిందా?

స) నేను దేనికదే కొత్త సినిమాగానే భావించి పనిచేస్తూంటా. అంతకుముందు సినిమా బ్లాక్‍బస్టర్ అయింది కదా అని ఆ సినిమా బరువును మోస్తూ మరో సినిమా చేయను. నన్ను ఎగ్జైట్ చేసే కథతో పనిచేస్తూంటా. కాబట్టి ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎప్పుడూ ఒత్తిడైతే లేదు.

ప్రశ్న) జనతా గ్యారెజ్ ట్రైలర్‍లోనే కథంతా చెప్పేసినట్టున్నారు?

స) (నవ్వుతూ..) మనం చెప్పాలనుకుంటున్న అంశం ఏంటో జనాల్లోకి తీసుకెళ్ళిపోయేలా చేయాలి. ట్రైలర్‍ను నేను ఇందుకు ఓ మంచి అవకాశంగా భావిస్తా. నా ట్రైలర్‍లో కథ చెప్పి ప్రేక్షకుడికి ముందే ఒక హింట్ ఇచ్చేస్తా. ఆ తర్వాత అదే ఆలోచనతో వాళ్ళూ సినిమా చూస్తారు.

ప్రశ్న) ఈ కథ ఎలా పుట్టింది? ఈ కథకు మొదట్నుంచీ ఎన్టీఆర్‍నే అనుకున్నారా?

స) ప్రకృతిని ప్రేమించే ఓ వ్యక్తి, మనుషుల్ని ప్రేమించే మరో వ్యక్తి.. ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందని, ఈ క్యారెక్టర్స్ నుంచే కథ పుట్టింది. బేసిక్ కథ రెడీ అయినపుడు ఏ హీరోనూ అనుకోలేదు. ఎన్టీఆర్‌కి కథ వినిపించగానే ఆయన ఓకే చెప్పేశారు. ఇక దాంతో ఆయన ఇమేజ్‌కు సరిపడేలా పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశా.

ప్రశ్న) ఎన్టీఆర్‌కు చాలాకాలం క్రితమే ఈ కథ చెప్పారట కదా? సినిమా రావడానికి ఇంతకాలం పట్టడానికి కారణం?

స) ఎన్టీఆర్ నాకు చాలాకాలం నుంచి పరిచయం. ఎప్పటికప్పుడు ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటూనే ఉన్నాం. మొదట ఎన్టీఆర్ రభస కాగానే ఈ సినిమా చేయల్సింది. అనుకోని కారణాలతో అది వాయిదా పడడం, నేను శ్రీమంతుడు సినిమాలో పడిపోవడంతో లేట్ అయింది. ఏదేమైనా ఎన్టీఆర్‌తో పనిచేయడం ఓ మంచి అనుభూతి. ఈ సినిమాకు ఆయన క్యారెక్టర్ మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుంది.

ప్రశ్న) మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్‌ని ఓ ప్రధాన పాత్రలో నటింపజేయాలన్న ఆలోచన ఎవరిది?

స) ముందే చెప్పినట్లు కథలో చెప్పిన రెండు ప్రధాన పాత్రల్లో ఒకటి ఎన్టీఆర్ చేస్తున్నారని కన్‌ఫర్మ్ అయ్యాక కథ పూర్తి చేయడం మొదలుపెట్టా. ఎందుకో తెలీదు కానీ, స్క్రిప్ట్ రాస్తున్నపుడు రెండో పాత్రలో నాకు మోహన్ లాల్ గారే గుర్తొచ్చారు. ఆయనను దృష్టిలో పెట్టుకొనే సన్నివేశాలు రాశా. ఒక్కసారి ఆయనను కలిసి కథ చెప్పి, ఆ క్యారెక్టర్‌కు ఒప్పించాక, ఇంక నా ఆనందానికి అవధుల్లేవు. ఎన్టీఆర్, మోహన్ లాల్ ఇద్దరినీ తెరపై చూడడం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. నేను ఈ ఇద్దరితో కలిసి 40 రోజులు పనిచేశా. ఆ రోజులను మరచిపోలేను.

ప్రశ్న) సమంత, నిత్యా మీనన్‍లలో మెయిన్ హీరోయిన్ ఎవరు? హీరో ప్రేమను ఎవరు దక్కించుకుంటారు?

స) మెయిన్ హీరోయిన్ ఎవరన్న ఆలోచనే అవసరం లేదు. నా కథల్లో బలమైన పాత్రలుంటాయి. ఇందులో ఎవరు గొప్ప లాంటివి నేనస్సలు పట్టించుకోను. ఇక హీరో చివరకు ఎవరికి దగ్గరవుతాడన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

ప్రశ్న) దేవిశ్రీ ప్రసాద్‌తో తప్ప మరో సంగీత దర్శకుడితో పనిచేయరేమని?

స) నా కథలకు, ఆయా సందర్భాలకు దేవిశ్రీ అయితే మంచి మ్యూజిక్ ఇస్తాడని నా నమ్మకం. మా ఇద్దరికీ ఉన్న ఫ్రెండ్‌షిప్ వల్ల కూడా నేనేం కోరుకుంటున్నానో అర్థం చేసుకోగలడు. అందువల్లే దేవిశ్రీతోనే వరుసగా సినిమాలు చేస్తూన్నా.

ప్రశ్న) జనతా గ్యారెజ్ సినిమాకు మేజర్ హైలైట్స్ ఏంటి?

స) కథే ఈ సినిమాకు హైలైట్ అని చెబుతా. నేను ఏది చెప్పినా కథకు లోబడే చెప్పాలని అనుకుంటా. అనవసరమైన కామెడీ, పాటలు పెట్టొద్దనే ప్రయత్నిస్తూంటా. నా దృష్టిలో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎంగేజింగ్‌గా ఓ కథ చెప్పడమే!

ప్రశ్న) హై బడ్జెట్ కమర్షియల్ సినిమాలే కాక, డిఫరెంట్ జానర్ సినిమాలు చేయాలని ఉందా?

స) తప్పకుండా ఉంటుంది. నాకూ ప్రేమకథలు చెప్పాలని ఉంటుంది. అయితే దానికో టైమ్ ఉంది. ముందు దర్శకుడిగా నాకంటూ ఒక స్టైల్ వచ్చాక కామెడీ, రొమాన్స్ లాంటి జానర్స్‌లో సినిమాలు చేస్తా.

ప్రశ్న) తదుపరి సినిమా మహేష్‌తోనే అన్నారు. అదెప్పుడు మొదలవుతుంది?

స) మహేష్ గారికి కథ ఎప్పుడో చెప్పేశా. ఆయన ఒప్పేసుకోవడంతో అప్పుడే స్క్రిప్ట్ పనులు కూడా మొదలుపెట్టేశా. పక్కాగా స్క్రిప్ట్ పూర్తి చేసి వచ్చే ఏడాదికి ఆ సినిమాను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాం.