
‘100% లవ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందు, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసిన ఈ హీరో, ఈ మధ్యే ‘బెస్ట్ యాక్టర్స్’తో మరోసారి మెప్పించారు. రేపు (సెప్టెంబర్ 3న) తన పుట్టినరోజు జరుపుకుంటున్న నందు, ఈ సందర్భంగా తన కెరీర్ గురించి చెప్పిన విశేషాలు..
ప్రశ్న) ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. బెస్ట్ యాక్టర్స్ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది?
స) థ్యాంక్స్ అండీ. బెస్ట్ యాక్టర్స్ సినిమాకు రెస్పాన్స్ చాలా బాగుంది. నా రోల్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా.
ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి. ఇలాంటి పాత్రను ఎంచుకోవడానికి కారణం?
స) రోల్ బాగా నచ్చింది కాబట్టి చేశా. మెసేజ్ ఓరియంటెడ్ కథను చెప్పాలన్న ప్రయత్నం కూడా నచ్చింది. చెప్పాలంటే నాకు స్వతహాగా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలంటే చాలా ఇష్టం. ఈ సినిమాతో ఆ తరహా పాత్ర చేశా.
ప్రశ్న) ఇప్పటివరకూ కెరీర్ ఎలా ఉంది ? ఇకపై ఎలా ఉంటుందనుకుంటున్నారు?
స) ఇప్పటికైతే అంతా బాగుందండీ. ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చా. ఇప్పడు నన్ను గుర్తించే వాళ్ళు, నా యాక్టింగ్‌ను ఇష్టపడి నాకు అవకాశాలు ఇచ్చే టాప్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నింటికీ నూరు శాతం న్యాయం చేశా. ఇకపై కూడా ఇలాగే ఎన్నో మంచి పాత్రలు చేస్తూ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా.
ప్రశ్న) మీ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ ఏది?
స) కచ్చితంగా రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో నటించడమనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో నేను చేసిన ‘365 డేస్’ నటుడిగా నాకు ఓ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే విధంగా వర్మ గారి ద్వారా ఇండస్ట్రీలో కూడా పరిచయాలు పెరిగాయి.
ప్రశ్న) కెరీర్ పరంగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది?
స) ఫ్యామిలీ పరంగా ఎప్పుడూ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండీ. అమ్మ, భార్య గీతా.. అంతా నా ప్రాజెక్టుల విషయంలో కూడా సలహాలు ఇస్తుంటారు. కెరీర్ పరంగా నా ఫ్యామిలీ ఇస్తోన్న సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు సాఫీగా సినిమాలు ఎంపిక చేసుకుంటూ వెళుతూన్నా.
ప్రశ్న) ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది?
స) నా అదృష్టం కొద్దీ ఇండస్ట్రీ నుంచి నాకు అన్ని విధాలా మంచి సపోర్ట్ ఉంది. నా సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నన్ను ప్రోత్సాహించడంలో మాత్రం ఎప్పుడూ అందరూ ముందున్నారు. చాలా మంది టాప్ డైరెక్టర్స్, ఈ క్యారెక్టర్‌కి నేను అవసరం అనుకుంటే వెంటనే పిలిచేస్తారు. అందరితోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయి.
ప్రశ్న) తదుపరి సినిమాలేంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి?
స) ప్రస్తుతం కౌషిక్ రాజు అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. కొన్ని ఇతర కథలు కూడా వింటున్నా. కొత్తతరం వారు నా దగ్గరకు వచ్చి కథలు చెబితే వారికి ఎప్పుడూ నా ఆహ్వానం ఉంటుంది. అలాంటి వారైతే సరికొత్త కథలతోనూ మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు.
ఇక అక్కడితో మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నందుతో మా ఇంటర్వ్యూ ముగించాం.

