ఇంటర్వ్యూ : నాని – అందుకే ఎప్పటికప్పుడు కొత్త కథలనే ప్రయత్నిస్తుంటా!

nani
’ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నాని నటించిన సినిమా ’జెంటిల్‌మన్’. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా భారీ అంచనాల నడుప రేపు (జూన్ 17న) విడుదల అవుతోంది. ఆ సందర్భంగా హీరో నానితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు:

ప్ర) ‘జెంటిల్‌మన్’ కథ గురించి చెప్పండి?

స) (నవ్వుతూ) కథ ఇప్పుడే చెప్పేస్తే, ప్రేక్షకులు అందులో ఉన్న థ్రిల్‌ని కోల్పోతారు. కాబట్టి ఆ కథేంటో సినిమా చూసే తెలుసుకోమని చెబుతా.

ప్ర) ’జంటిల్‌మన్’ అన్న టైటిల్ వెనుక కథేంటో అయినా చెప్పండి?

స) టైటిల్‌లో కథ ఏమీ అర్థం కాకూడదు. మళ్ళీ అది కథకు సరిపడేలా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాకి ఏ టైటిల్ అయితే బాగుంటుందా అని చాలా రోజులు చర్చించాం. చివరికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారే ‘జెంటిల్ మన్’ పేరు సూచించారు. ఐతే తెలుగులో టైటిల్ పెడదామని.. దీనికి సరిపడే తెలుగు పదం కోసం చాలా రోజులు ఆలోచించాం. కానీ సరైన పదం దొరకక చివరికి శ్రీనివాస్ అవసరాలను అడిగితే.. అతను ‘జెంటిల్ మన్’ అన్న పేరే బాగుందనడంతో చివరికి ఈ టైటిల్ ని ఫిక్స్ చేశాం. సినిమా చూశాక ఈ టైటిల్ కరెక్ట్ అని ప్రేక్షకులు అంటారు. అందుకే సినిమాలో కూడా మొదటిలో కాకుండా చివరలోనే ఈ టైటిల్ వేశాం.

ప) ఇందులో మీరు ద్విపాత్రిభినయం చేశారా..?

స) ఎవరు చెప్పారు? రెండు షేడ్స్ అని మాత్రమే చెప్పాం(నవ్వుతూ). అయినా రెండు షేడ్స్ ఉన్న పాత్రనా? లేక రెండు పాత్రలా? అన్నది మీరే చూసి తెలుసుకోండి.

ప్ర) ఇంద్రగంటి ఆబ్లిగేషన్ మీద ఈ సినిమా చేశారా?

స) నేను పొరపాటున కూడా ఆబ్లిగేషన్‌పై ఎప్పుడూ సినిమా ఒప్పుకోను. నిజానికి ఇంద్రగంటి మోహన కృష్ణ అనో లేదా మరో కారణంతోనో ఈ సినిమా చేయలేదు. కేవలం ఈ కథ నచ్చింది కాబట్టే సినిమా చేయడానికి ఒప్పుకున్నా.

ప్ర) ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో ’అష్టాచెమ్మా’ కు పనిచేసినప్పుడు ఇప్పటికీ తేడా ఏంటి?

స) ఆయన అప్పుడు డైరక్టర్‌గా కంటే కూడా మంచి రచయిత అని తెలుసు. ఇప్పుడు రచయితని మించి మంచి దర్శకుడు అయ్యారని అనుకుంటున్నాను. టెక్నికల్‌ అంశాల పరంగా కూడా చాలా ఆయన స్థాయి మరింత పెరిగింది.

ప్ర) మల్టీ స్టారర్ సినిమాలు చేస్తారా?

స) తప్పకుండా! నిజానికి ఇక్కడ వేరే హీరోతో పనిచేయాలంటే రెండు పాత్రలూ సమానం ఉండాలనుకుంటారు. కానీ ’పెదరాయుడు’ సినిమాలో రజనీకాంత్ పాత్రను చూసి ఎవరైనా ఏంటి ఆయన ఇంత చిన్న పాత్ర చేశారేమని అనగలరా? కథలో పాత్రకు ఉండాల్సిన ప్రాధాన్యం చూడాలంతే! ఇక మంచి స్క్రిప్ట్ వస్తే, మల్టీస్టారర్ చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే!

ప్ర) నటుడిగా కెరీర్ పరంగా ఎప్పుడైనా బోర్ కొట్టిందా?

స) మూస కథలు చేస్తూ పోతే, నాకనే కాదు, ఎవ్వరికైనా బోర్ కొడుతుంది. అదే కొత్త కాన్సెప్ట్స్‌తో వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకుంటాం కాబట్టి బోర్ కొట్టే ప్రసక్తే లేదు. నా వరకూ నేను ఎప్పుడూ కొత్తదనం వైపే ఆలోచిస్తూంటా.

ప్ర) తమిళ సినిమాలలో నటిస్తున్నారా?

స) ఇప్పటికైతే లేదు. నిజానికి నాకు తమిళ సినిమాలంటే చాలా గౌరవం. కానీ నేను తెలుగులో సినిమా చేసేటప్పుడు నాకు భాష అర్థం అవుతుంది కాబట్టి దర్శకుడికి రెండు మూడు విధాలుగా నటించి చూపేవాడిని. కానీ తమిళ్ భాష రాకపోవడంతో ఇచ్చిన డైలాగులు బట్టీ పట్టి అప్పచెప్పాల్సి వచ్చేది. అందుకే తమిళంలో సినిమాలు తగ్గించా. తెలుగు, తమిళం రెండు భాషల్లో చేయదగ్గ సినిమా ఏదైనా వస్తే కచ్చితంగా చేస్తా.

ప్ర) దర్శకత్వం ఎప్పుడు చేస్తారు?

స) ఇప్పుడు ఆ ఉద్దేశ్యం లేదు. కానీ దర్శకత్వం చేయాలనిపించినప్పుడు మాత్రం నటుడిగా ఒక సంవత్సరం బ్రేక్ తీసుకొని పూర్తిగా దర్శకత్వంపైనే శ్రద్ధ పెట్టి సినిమా చేస్తా.

ప్ర) మీ తదుపరి సినిమాలు ఏంటి?

స) ప్రస్తుతం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా.దిల్ రాజు గారి బ్యానర్ లో ఓ సినిమా ఉంటుంది. భవ్య క్రియేషన్స్‌తో కూడా ఓ సినిమా కమిట్ అయ్యా.

Exit mobile version