మొదటి సినిమా ‘అష్టా చమ్మా’తోనే మన ఇంట్లో కుర్రాడిలా తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘భలే భలే మగాడివోయ్’. లో బడ్జెట్ లో బిగ్ హిట్స్ అందించిన మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నానితో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆ విశేషాలు మీకోసం..
ప్రశ్న) ‘భలే భలే మగాడివోయ్’ సైన్ చేయడానికి మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏమిటి.?
స) డైరెక్టర్ మారుతి కథని నేరేట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది, అలాగే అతను నెరేషన్ ఇస్తున్నంత సేపు ఫుల్ గా నవ్వుకున్నాను. వీటితో పాటు మతిమరుపు అనే కాన్సెప్ట్ ని ఆధ్యంతం ఎంటర్టైనింగ్ గా చెప్పిన విధానం నన్ను ఇంకా బాగా ఆకట్టుకుంది.
ప్రశ్న) మారుతి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాని ఓకే చేసేటప్పుడు మీ పరంగా ఏమైనా అభ్యంతరాలు చెప్పారా.?
స) చెప్పాలంటే మొదట కథ వినడానికి ముందు ఆ ఇమేజ్ విషయంలో నేను సంశయించాను. కానీ కథ విన్నాక చిన్న చిన్న మార్పుల తర్వాత ఫైనల్ స్క్రిప్ట్ ని ఓకే చేసాను. ఆ తర్వాత మారుతికి నేను ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. ముఖ్యంగా ఒకటి చెప్పాలి, గత సినిమాల కంటే ఈ సినిమాతో ఓ సరికొత్త మారుతిని చూస్తారు. ఈ సారి అన్ని వార్గాల ప్రేక్షకులను మెప్పిస్తాడు.
ప్రశ్న) రేపు రిలీజ్ కానున్న మీ సినిమాకి బయట క్రేజ్ ఎలా ఉంది.?
స) ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ తర్వాత, నా కెరీర్ విషయంలో అంతటా పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. నా పరంగా మా సిస్టర్ నాకు పెద్ద విమర్శకురాలు. ఎందుకంటే నా మొహాన ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది. తను భలే భలే మగాడివోయ్ సినిమా చూసింది, తనకి సినమా బాగా నచ్చింది. తన పాజిటివ్ రెస్పాన్స్ తో చాలా రిలీఫ్ అయ్యాను. అలాగే సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ ఉండడం హ్యాపీగా కూడా ఉంది.
ప్రశ్న) ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. ఒకే సినిమాతో అటు గీత ఆర్ట్స్, ఇటు యువి క్రియేషన్స్ తో కలిసి పనిచేయడం ఎలా ఉంది.?
స) ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ఇద్దరు నిర్మాతలు సెట్లో నన్ను చాలా బాగా చూసుకున్నారు. వీటన్నిటికంటే గీత ఆర్ట్స్ 2 – యువి క్రియేషన్స్ లాంటి వారు ఇలాంటి మీడియం బడ్జెట్ సినిమాలు చేయడానికి ముందుకు రావడం చాలా శుభపరిణామం. దీనిద్వారా ఇండస్ట్రీకి చాలా మంచిది, అలాగే టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు కూడా వస్తాయి.
ప్రశ్న) ఈ సినిమాలో మీరు చేసిన మీ మతిమరుపు పాత్ర గురించి చెప్పండి.?
స) పైన చెప్పినట్టు ఈ సినిమాలో నేను కాస్త మతిమరుపు ఉన్న పాత్రలో కనిపిస్తాను. ఆ మతి మరుపు సమస్య వల్ల నేను ఫేస్ చేసిన సమస్యలు ఏంటనేదే మిగిలిన కథ. మతిమరుపు క్వాలిటీ వలన నా పాత్రలో చాలా ఫన్ ఉంటుంది, చెప్పాలంటే ఆ పాత్ర నా రియల్ లైఫ్ కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. రియల్ లైఫ్ లో కూడా నేను చాలా విషయాలను త్వరగా మరచిపోతూ ఉంటాను.
ప్రశ్న) ఆ మధ్య వచ్చిన వరుస ఫెయిల్యూర్స్ ని ఎలా తీసుకున్నారు.?
స) మీరు నా కరీర్ ని చూసుకుంటే.. ఇప్పటి వరకూ నేను 12 సినిమాలు చేసాను, అందులో 8/9 సినిమాలు డీసెంట్ హిట్స్ గా మిగిలాయి. కానీ ఇక్కడ షాకింగ్ గా అనిపించే విషయం ఏమిటంటే ప్రేక్షకులు నా హిట్స్ ని మరచిపోయి ఫ్లాప్స్ ని మాత్రమే గుర్తుంచుకోవడం.
ప్రశ్న) పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు లాంటి ఫెయిల్యూర్ సినిమాల నుంచి మీరేం నేర్చుకున్నారు.?
స) నా పరంగా నేను బాగా ఇష్టపడి ఆ సినిమాలలో హీరోగా చేసాను. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆ సినిమాల ద్వారా నేను తెలుసుకున్నది ప్రేక్షకులు నా నుంచి ఆసక్తికరమైన కొత్త పాత్రలని, అలాగే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమాలను కోరుకుంటున్నారు. ఆ పరంగానే ఇప్పుడు కథలను ఎంచుకుంటున్నాను.
ప్రశ్న) అంటే ఇక నుంచి ప్రయోగాత్మక సినిమాలు చేయడం ఆపేస్తున్నారా.?
స) ప్రయోగాత్మక కథలు చేయను అని చెప్పలేను.. కానీ ఇక నుంచి నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఉన్న సినిమాలను ఎంచుకుంటాను. ప్రస్తుతం అలాంటి సినిమాల కోసం చూస్తున్నాను, ఇప్పటికే కొన్ని ఆసక్తిక సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాను.
ప్రశ్న) సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న గోపి సుందర్ మ్యూజిక్ గురించి చెప్పండి.?
స) గోపి సుందర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకి తన మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ అవుతుంది. టాలీవుడ్ లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ఆశిస్తున్నాను.
ప్రశ్న) రాజమౌళి అండ్ ఫ్యామిలీ మీ సినిమాలని ప్రమోట్ చేస్తుంటారు. ఎందుకలా.?
స) నాకు తెలిసి వాళ్ళెప్పుడు నా సినిమాని ప్రత్యేకంగా ప్రమోట్ చేయలేదు. అలాగే నేనెప్పుడూ నా సినిమా గురించి రెండు మంచి మాటలు చెప్పండి అని వాళ్ళని అడగలేదు. రాజమౌళి గారు నా సినిమాలను లేదా కొత్త సినిమా ట్రైలర్స్ ని చూసినప్పుడు ఆయనకు బాగా నచ్చితే ట్విట్టర్ ద్వారా లేదా ఫోన్ చేసి నాకు కంగ్రాట్స్ చెప్తారు. వాళ్ళు నాకిచ్చే పెద్ద సపోర్ట్ అంటే నా ప్రతి సినిమాని మొదటి రోజు మొదటి షో చూడటమే.
ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?
స) హను రాఘవపూడి – 14 రీల్స్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా ఇప్పటికే 40% షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో నేను హార్డ్ కోర్ బాలయ్య బాబు అభిమానిగా కనిపిస్తాను. ఈ సినిమాలో కూడా ఆసక్తికర కథ ఉంటుంది.


