
భారత సినిమా రంగంలో మూడు కంటే ఎక్కువ భాషలలో నటించే నటుడు ఎవరూ అంటే, అందరూ చెప్పేది జాతీయ అవార్డు గ్రహీత విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేరునే. అయన ప్రస్తుతం, స్వీయ దర్శకత్వంలో ‘ఉలవచారు బిర్యాని’ సినిమాని ఒకేసారి మూడు భాషలలో తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాతో కాసేపు ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..
ప్ర) మీరు దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని ఫీల్ గుడ్ మూవీస్, మరీ ‘ఉలవచారు బిర్యాని’ సినిమా ఎలా ఉండబోతుంది?
స) ‘ఉలవచారు బిర్యాని’ సినిమా చూసి ధియేటర్ నుండి బయటకి వచ్చే ప్రతి ప్రేక్షకుడి ముఖంపైన చిరు నవ్వు ఉంటుంది. ఇది ఒక ప్రేమ భరితమైన సినిమా.
ప్ర) ఒకేసారి మూడు భాషలలో తీయడం కష్టం అవలేదా?
స) మూడు భాషలలో ఒకేసారి షూటింగ్ చేయడం కష్టం అయినప్పటికీ, ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. మూడు రాష్ట్రాల సినీ పరిశ్రమలలోని గొప్ప గొప్ప వ్యక్తులతో పని చేసే అదృష్టం దక్కింది. ఆయా ప్రాంతాల సంస్కృతులను కూడా తెలుసుకోవడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది.
ప్ర) ఈ సినిమాలోని యువ నటుడి గురించి చెప్పండి?
స) కే.ఎస్.రామారావు గారు, తేజస్ అనే ఒక కుర్రాడ్ని నా దగ్గరికి పంపాడు. తనపై తనకు ఉన్న నమ్మకం నాకు బాగా నచింది, అంతేకాకుండా తను ఒక ఏడాది పాటు తేజ దగ్గర పని చేశాడు. ఇంకేం ఆలోచించకుండా అతన్ని తీసుకున్నాను.
ప్ర) మీరు మీ క్యారీర్ లో ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్స్ చేశారు, మరి ఈ సినిమాలో నటించడం ఎలా అనిపించింది?
స) ఒక నటుడికి ప్రతి సినిమా ఒక కొత్త అనుభవం. ఆ క్యారెక్టర్ కు తగ్గట్టు, అందులో ఇమిడి పోయి నటిస్తే ప్రేక్షకులు తప్పకుండ మెచ్చుకుంటారు.
ప్ర) ఇళయరాజా గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
స) ఇళయరాజా వంటి గొప్ప వ్యక్తితో పనిచేయడం నిజంగా నా అదృష్టం. అయనతో పని చేసిన ప్రతి రోజు నాకు అద్భుతమే. అయన దగ్గర నుండి నేను చాలా నేర్చుకున్నాను.
ప్ర) మీరు అన్ని కమర్షియల్ సినిమాలలో నటిస్తారు కదా, మరి వాటికి భిన్నంగా ఉండే సినిమాలకు ఎందుకు దర్శకత్వం వహిస్తుంటారు?
స) నాకు కమర్షియల్ సినిమాలలో నటించడం అంటే చాలా ఇష్టం. కానీ దర్శకుడిగా వాటికి భిన్నమైన సినిమాలు చేయాలనుకుంటాను, వాటి ద్వారా వచ్చే ప్రశంసలు నన్ను ఉత్తేజ పరుస్తాయి.
ప్ర) ఈ సినిమాలో స్నేహ పాత్ర గురించి చెప్పండి?
స) ఈ సినిమాలో స్నేహ ఒక మంచి పాత్రలో నటిస్తుంది. తన నటన చూసి నేను ఆశ్చర్య పోయాను.
ప్ర) బాలీవుడ్ లో ఈ సినిమాను ఎందుకు తీయాలనుకోలేదు?
స) ఈ సినిమా రీమేక్ హక్కులు నా దగ్గరే ఉన్నాయి. మన సంస్కృతికి అక్కడి సంస్కృతికి చాలా తేడా ఉంటుంది, దానికి చాలా హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. అన్నిటి పైన ఒక అవగాహనా వచ్చాక తప్పకుండ తీస్తాను.
ప్ర) నటించడం, నిర్మించడం, దర్శకత్వం: వీటిలో మీకు ఏది ఇష్టం?
స) దర్శకత్వం అంటేనే చాలా ఇష్టం. ఒక దర్శకుడిగా చాలా నేర్చుకోవొచ్చు, సినిమాపై పూర్తి పట్టు ఉంటుంది.
ప్ర) మీకు నచ్చే వంట?
స) బిర్యాని! నాకు బిర్యాని అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళిన, ఆ ప్రాంత బిర్యాని రుచి చూస్తాను. నాకు తెలిసి, అన్ని వంటల్లో కళ్ళ బిర్యాని ఒక అద్భుతమైన వంట.
అంతటితో ప్రకాష్ రాజ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..

