ఇంటర్వ్యూ : రాజ్ తరుణ్ – ‘కుమారి 21F’.. సుకుమార్ మార్క్ లవ్‌స్టోరీ!

raj-tarun
‘కుమారి 21 ఎఫ్’.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌ యూత్‌ఫుల్ క్రేజీ సినిమాగా విపరీతమైన అంచనాలను మూటగట్టుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హ్యాట్రిక్ హిట్‌పై కన్నేసిన హీరో రాజ్ తరుణ్‌తో ‘కుమారి 21 ఎఫ్’ సినిమా విశేషాల గురించి ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నారు. ఆ విశేషాలు..

ప్రశ్న) ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’.. రెండు సూపర్ హిట్స్ తర్వాత వస్తోన్న సినిమా ‘కుమారి 21F’. ఈ సినిమా హ్యాట్రిక్ తెచ్చిపెడుతుందని అనుకుంటున్నారా?

స) నేనైతే కచ్చితంగా ఆ హ్యాట్రిక్ హిట్ వస్తుందన్న నమ్మకంతోనే ఉన్నా. నా గత సినిమాలకు, దీనికి ఎక్కడా పోలికలుండవు. ఇది పూర్తిగా సరికొత్త ఎమోషన్‌తో సాగే ఈ జనరేషన్ ప్రేమకథ.

ప్రశ్న) సుకుమార్ నిర్మాణంలో సినిమా అవకాశం అనగానే ఎలా అనిపించింది? ఈ సినిమాను ఎంచుకోవడానికి ముఖ్య కారణం?

స) సుకుమార్ గారి సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కుమారి 21F’కు కూడా కథ, స్క్రీన్‌ప్లే ఆయనే అందించారు. ఈ కథ వినగానే ఆ ఎమోషన్‌కు విపరీతంగా కనెక్ట్ అయిపోయా. సుకుమార్ గారి ప్రేమకథల్లో లవ్‌జర్నీలోని చిన్న చిన్న ఎమోషన్‌ను ఆయన అద్భుతంగా పట్టుకుంటారు. ఈ సినిమాకు హైలైట్ అంటే అదే! ఇక ఇది ఈ జనరేషన్ సినిమా అయినా కూడా యూత్ స్టేజ్‌ను దాటివచ్చిన వారైతే ఇది మన జీవితంలోనూ జరిగిందే అని, ఇప్పుడదే స్టేజ్‌లో ఉన్నవారైతే ఇది మనకథే కదా అని తప్పకుండా అనుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే.. సుకుమార్ మార్క్ అందమైన ప్రేమకథే ‘కుమారి 21F’!

ప్రశ్న) ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువైంది, అందుకే ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చిందన్న అభిప్రాయాలపై ఏమంటారు?

స) ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదండీ. కుమారి 21F ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడదగ్గ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ. ఈ జనరేషన్ ప్రేమకథ కాబట్టి కొన్ని సెన్సార్ పరిధిని దాటిన అంశాల ప్రస్తావన ఉండొచ్చు. ఆ మాటకొస్తే.. ‘పోకిరి’, ‘మగధీర’ సినిమాలు కూడా ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాలే! సెన్సార్ నిబంధనల మేరకు ఏ వచ్చిందే కానీ ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ అస్సల్లేదు.

ప్రశ్న) ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో మీ పాత్ర విషయంలో చూపిన కొత్తదనం ఏంటి?

స) ఇంతకుముందు నేను చేసిన రెండు పాత్రలు ఎంతో కొంత హైపర్‌గా ప్రవర్తిస్తుంటాయి. ఈ సినిమాలో మాత్రం నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. హీరోగా ఎప్పుడూ కొత్త కొత్త పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం.

ప్రశ్న) దర్శకుడు సూర్య ప్రతాప్ గురించి చెప్పండి?

స) సూర్య ప్రతాప్.. తన మొదటి సినిమా ‘కరెంట్’తోనే కొత్తదనం చూపించారు. ఈ సినిమాలో సుకుమార్ గారి కథను ఆయన ప్రెజెంట్ చేసిన విధానం కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. కథలోని అసలైన ఎమోషన్‌ను దర్శకుడు సరిగ్గా క్యారీ చేశారు.

ప్రశ్న) హెబ్బా పటేల్ క్యారెక్టర్ సినిమాలో మిమ్మల్ని డామినేట్ చేస్తుందా?

స) ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్‌ను డామినేట్ చేయడం అంటూ ఏమీ ఉండదు. ఇది ఒక ప్రేమజంట కథ. కథైతే హెబ్బా పటేల్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే సినిమాకు కూడా అమ్మాయి పేరే పెట్టాం. ఇక హెబ్బా పటేల్ కూడా తన పాత్రలో అద్భుతంగా నటించింది.

ప్రశ్న) ప్రస్తుతం వరుస సినిమాలు లైన్లో పెట్టినట్టున్నారు. ఏయే సినిమాలు ఫైనలైజ్ అయ్యాయి?

స) ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక ఆ తర్వాత వంశీ గారితో ఓ సినిమా, గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా, మంచు విష్ణు గారితో ఓ మల్టీస్టారర్.. ఇలా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తా!

Exit mobile version