
సినిమాలపై మక్కువతో సాఫ్ట్ వేర్ రంగం నుండి తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తన తొలి అడుగులు వేసిన వ్యక్తి రాకేష్ శ్రీనివాస్. స్వీయ దర్శకత్వంలో తన మితుడు విజయ్ కుమార్ రాజుతో కలసి రాకేష్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’. ట్రైలర్లతోనే ఈ సినిమా సంచలనం సృష్టించింది. షఫీ, జోయా ఖాన్ జంటగా నటించిన ఈ సినిమా జనవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను తెలియజేయడానికి దర్శకుడు మీడియాతో సమావేశం అయ్యారు. ఆ ముచ్చట్లు మీకోసం..
ప్రశ్న) మీ సినిమా స్టొరీ లైన్ ఏంటి..?
స) సినిమాలో హీరో శ్యామ్ గోపాల్ వర్మ ఒక దర్శకుడు. రక్తపాతం, హింసాత్మక నేపధ్యంలో సినిమాలు తీయడం అంటే ఇష్టం. అలాంటి సినిమాలు తీయడం ద్వారా దర్శకుడికి ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది సినిమా కథ. ఇదొక ‘సెటైరికల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్’ సినిమా.
ప్రశ్న) రామ్ గోపాల్ వర్మ మీద ఎందుకు సెటైర్ వేస్తున్నారు..?
స) ఓ వ్యక్తి మీద కాదు, వ్యవస్థ మీద సెటైరికల్ గా తీసిన సినిమా ఇది. నేను చెప్పాలనుకున్న కథలో సినిమా నేపధ్యం ఒక లేయర్ మాత్రమే. సినిమా థీమ్ ఏంటో ట్రైలర్లు, ప్రోమోల ద్వారా చెప్పాను. ఆ విషయం ప్రేక్షకులకు చేరువయిందని అనుకుంటున్నాను. మన దేశంలో పేర్లకు పేటెంట్ హక్కులు లేవు కాబట్టి కొన్ని ఊహలకు వదిలేస్తే అందంగా ఉంటుంది. నా సినిమా పేరు ఓ ప్రముఖ దర్శకుడి పేరును పోలి ఉంది అంతే. కథ ఏంటో విడుదల రోజున సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్రశ్న) సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసమే టైటిల్ ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ’ అని పెట్టారా..?
స) సెన్సేషన్ క్రియేట్ చేయడం వలన మార్నింగ్ షోకి ఓపెనింగ్స్ వస్తాయేమో.. కానీ, సినిమా విజయం సాధించదు. మార్నింగ్ షో తర్వాత పబ్లిక్ టాక్ ఏంటో అందరికీ తెలుస్తుంది. ఓ కొత్త దర్శకుడు సినిమా తీయాలంటే ముందు ప్రేక్షకులలో ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. లేదంటే, సినిమా ఎంత బాగున్నా ప్రేక్షకులకు చేరువ కాదు, థియేటర్ వద్దకు రారు. సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేసే కథ, కథనం ఉండడం ముఖ్యం. నా దగ్గర ఉన్న కథలలో ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ’ కథ ద్వారా దర్శకుడిగా పరిచయం అయితే బాగుంటుందని భావించాను. మీరన్నది నిజమే, టైటిల్ వల్ల ప్రేక్షకులలో సినిమాపై క్యూరియాసిటీ కలిగింది, మాకు హెల్ప్ అయ్యింది. కథను నమ్మి నేను ఈ సినిమాను తెరకేక్కించాను.
ప్రశ్న) షఫీని హీరోగా తీసుకోవడానికి గల కారణం..?
స) హిందీలో నానా పటేకర్, నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్, మనోజ్ బాజ్ పాయ్ వంటి నటుల తరహాలో ఎటువంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్న నటులు మన తెలుగు పరిశ్రమలో అతి కొద్ది మంది ఉన్నారు. అందులో షఫీ ఒకరు. ఈ సినిమాలో హీరో పాత్రకు అతనైతే 100 శాతం న్యాయం చేయగలడని హీరోగా ఎంపిక చేశాం. శ్యామ్ గోపాల్ వర్మ పాత్రలో ఒదిగిపోయాడు. చక్కని నటన కనబరిచాడు.
ప్రశ్న) దర్శకనిర్మాతగా ఇదే మీ మొదటి సినిమా. నిర్మాణంలో, దర్శకత్వంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా..?
స) నా దృష్టిలో ఒక జోక్ ను చెప్పి ప్రేక్షకులను నవ్వించగలిగిన ప్రతి ఒక్కరూ దర్శకుడే. దర్శకత్వం అనేది క్రియేటివ్ జాబ్, ఒకరి వద్ద ట్రైనింగ్ తీసుకోవలసిన అవసరం లేదు. దర్శకత్వపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. సినిమా నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఓ ఆరు నెలల పాటు రీసెర్చ్ చేశాను. ఇండస్ట్రీలో వ్యక్తులను కలసి ప్రొడక్షన్ తీరుతెన్నులు తెలుసుకున్నాను. అందువల్ల పెద్దగా కష్టాలు పడలేదు. ఒక్క మేకప్ ఆర్టిస్టులు, సహాయకుల విషయంలో నా లెక్క తప్పింది. హీరో హీరోయిన్లతో పాటు వారికి కూడా డబ్బులు ఇవ్వాలని ముందుగా నాకు తెలియదు.
ప్రశ్న) దర్శకత్వంలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు..?
స) బాల్యంలో సినిమా రంగం వైపు నన్ను ఆకర్షించిన మొదటి సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’. దర్శకుడిగా నాకు స్ఫూర్తి మాత్రం కె.బాలచందర్ గారు. ఆయన తీసిన ప్రతి సినిమా ఒక 20 ఇయర్స్ అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఇప్పటి సమాజం ఎలా ఉంటుందో ఒక 20 ఏళ్ళ ముందే ఊహించి సినిమా తీసిన గొప్ప దర్శకుడు బాలచందర్ గారు.
ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..?
స) ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాను. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ మనోజ్ బాజ్ పాయ్ అయితే హీరోగా బెటర్ అని నా ఫీలింగ్. ప్రస్తుతానికి జనవరి 1న సినిమా ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాను. అంటూ ఇంటర్వ్యూని ముగించారు.

