‘మౌనమేలనోయి’, ‘నిను చూడక నేనుండలేను’, ‘ఓరేయ్ పండు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో సచిన్ జోషి. ఈ మూడు సినిమాల తర్వాత బాలీవుడ్ కి పరిమితమైన సచిన్ జోషి చాలా రోజుల తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఆషికి 2 రీమేక్ అయిన ‘నీజతగా నేనుండాలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆగుస్ట్ 15న రిలీజ్ కానుంది. నజియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాత. రేపు పుట్టిన రోజు జరుపుకోనున్న సచిన్ జోషితో కాసేపు ముచ్చటించాము.. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) తెలుగులో సినిమాలకి ఎందుకు ఇంత లాంగ్ గ్యాప్ ఇచ్చారు.?
స) అవును చాలా గ్యాప్ ఇచ్చాను.. నా చివరి తెలుగు సినిమా ఓరేయ్ పండు 2005లో విడుదలైంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయాను అక్కడ వరుసగా 3 సినిమాలు చేసాను. ఆ సినిమాల కోసం ఎక్కువ టైం కేటాయించాల్సి వచ్చింది. అందుకే మధ్యలో తెలుగు సినిమాలు చేయలేకపోయాను. ఓ సందర్భంలో నేను బండ్ల గణేష్ గారు కలిసాం. అప్పుడే ఆయన ఎందుకు తెలుగులో సినిమాలు చేయడం లేదు, టాలీవుడ్ మార్కెట్ చాలా మారిపోయింది. నువ్వు తెలుగులో సినిమాలు చెయ్యాలి అని చెప్పి నన్ను ప్రోత్సహించడం వలనే మళ్ళీ తెలుగు సినిమాలు చెయ్యడానికి ఓకే అన్నాను.
ప్రశ్న) మీ కమ్ బ్యాక్ మూవీగా ‘ఆషికి 2’ ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి.?
స) నేను తెలుగులో అన్నీ లవ్ స్టొరీలే చేసాను. ఆ తర్వాత్ బాలీవుడ్ లో థ్రిల్లర్, యాక్షన్ జోనర్స్ లో సినిమాలు చేసాను. వాటికి భిన్నంగా మళ్ళీ లవ్ స్టొరీ చెయ్యాలి అనుకున్నాం. అప్పుడు మా అందరి మదిలోకి వచ్చిన సినిమా ‘ఆషికి 2’. బాలీవుడ్ లో పెద్ద హిట్, సినిమాలో మంచి మ్యూజిక్, మంచి ఫీల్ ఉంటుంది అందుకే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాం.
ప్రశ్న) మరి తెలుగు కోసం ఆషికి 2 లో ఏమన్నా మార్పులు చేసారా.?
స) సినిమాలోని కంటెంట్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. అది ఫీల్ గుడ్ స్టొరీ. దాన్ని మారిస్తే ఆ ఫీల్ పోతుంది. అందుకే మార్పు చేయలేదు. కానీ తెలుగు నేటివిటీకి సరిపోయే విధంగా చూపించడంలో, మేకింగ్ మరియు మ్యూజిక్ పరంగా మాత్రం డిఫరెంట్ గా ఉండడమే కాకుండా ‘ఆషికి 2’ కంటే బాగుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.
ప్రశ్న) ఈ సినిమాకి డైరెక్టర్ గా జయ రవీంద్రని తీసుకోవడానికి గల కారణం ఏమిటి.?
స) ఆషికి 2 అనుకున్నాక జయరవీంద్ర ఈ సినిమాకి న్యాయం చేస్తాడని బండ్ల గణేష్ గారే తీసుకున్నారు. నా పరంగా ఇదొక కమర్షియల్ సినిమా కాదు, ఎమోషన్స్ అనేవే సినిమాకి కీలకం, అవి జయ హ్యాండిల్ చేయగలడా అనుకున్నాను. తను చేసిన బంపర్ ఆఫర్ చూసాక కాస్ట్ నమ్మాను, ఆ తర్వాత స్క్రిప్ట్ దశలో అతను సీన్స్ మార్చిన విధానం, వివరించే విధానం నాకు బాగా నచ్చడంతో కథకి న్యాయం చేయగలడు అని నమ్మాను. మేము నమ్మినట్టుగానే సినిమాలో ఫీల్ ఏ మాత్రం మిస్ కాకుండా ఈ సినిమాని తీసాడు.
ప్రశ్న) హీరోయిన్ గా నజియాని తీసుకోవడానికి గల కారణం ఏమిటి.?
స) ఈ సినిమా కోసం ముందుగా సమంత, తమన్నా లాంటి వాళ్ళను తీసుకోవాలి అనుకున్నాం. కానీ ఈ సినిమా మొత్తం హీరో – హీరోయిన్ లవ్ అండ్ ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కావున తెలిసిన వాళ్ళకంటే కొత్త హీరోయిన్ అయితే ఆడియన్స్ కొత్తగా ఫీలవుతారని భావించాం. అందుకే నజియాని స్లేక్ట్ చేసాం. నజియా పెర్ఫార్మన్స్ కూడా సినిమాకి హైలైట్ అవుతుంది.
ప్రశ్న) ‘ఆషికి 2’ ఒరిజినల్ పాటలనే ఇందులో వాడటానికి గల కారం ఏమిటి.?
స) ‘ఆషికి 2’ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం సాంగ్స్ అండ్ మ్యూజిక్. తెలుగులో పాటలను మార్చి వేరే సాంగ్స్ తీసుకునే ఒరిజినల్ కంటెంట్ లోని ఫ్లేవర్ మరియు ఫీల్ మిస్ అవుతుందని అదే పాటలని ఇందులో పెట్టాము. పాటలకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
ప్రశ్న) మీరొక బిజినెస్ మాన్. మీ పరంగా బిజినెస్ కష్టమా లేక సినిమాలో నటించడం కష్టమా.?
స) నా పరంగా బిజినెస్ చేయడం కంటే సినిమా చేయడమే కష్టం. బిజినెస్ లో మన వర్క్ ఏంటో చేస్తే చాలు ఎక్స్ ప్రెషన్స్ అవసరం లేదు. బిజినెస్ లో ఏమన్నా మిస్టేక్స్ వచ్చినా కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ సినిమా విషయంలో కరెక్ట్ చేయలేం. కథ దగ్గర నుంచి పబ్లిక్, మీడియా, ప్రమోషన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.
ప్రశ్న) ప్రొడక్షన్ వైపు ఏమన్నా అడుగులేయనున్నారా.?
స) అవను. త్వరలో థింక్ టాక్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించే పనిలో ఉన్నాను. ఇది ఆన్ లైన్ డిజిటల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఈ ప్రొడక్షన్ బ్యానర్ పై షార్ట్ ఫిల్మ్స్ నుండి అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను.
ప్రశ్న) మీ తదుపరి సినిమాలు ఏమిటి.?
స) ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చర్చలో దశలో ఉన్నాయి. అందులో ఒకటి హర్రర్ సినిమా అయితే మరొకటి లవ్ స్టొరీ. వీటితో పాటు ఆషికి 2 ని తమిళంలో నేను హీరోగా రీమేక్ చెయ్యాలనుకుంటున్నాను. అలాగే ఇక నేను చేసే సినిమాలను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించాలనుకుంటున్నాను.
అంతటితో సచిన్ జోషికి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ తో పాటు ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..


