ఇంటర్వ్యూ : నేను స్టార్ హీరోలతో పనిచేయలేను – తరుణ్ భాస్కర్ !

ఇంటర్వ్యూ : నేను స్టార్ హీరోలతో పనిచేయలేను – తరుణ్ భాస్కర్ !

Published on Jun 28, 2018 5:11 PM IST

‘పెళ్లిచూపులు’తో మంచి విజయాన్ని సాధించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ చిత్రం రేపు విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

రేపు మీ సినిమా రిలీజ్ అవుతుంది ఎమైనా ఒత్తిడికి లోనవుతున్నారా ?
ఇంతకుముందు నా మొదటి చిత్రం ‘పెళ్లిచూపులు’ విడుదల సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యాను. అప్పుడు ఏం చేయాలో తెలియదు కానీ ఇప్పుడు చాలా రిలాక్స్ గా ఉన్నాను. సురేష్ బాబు గారు ఈ చిత్రానికి నిర్మాత కావడం వల్ల నా జాబ్ ఇంకా ఈజీ అయింది. ఎందుకంటే సినిమా సంబంధించిన పనులు అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు.

మీ ‘పెళ్లి చూపులు’ సినిమా విడుదలకు ముందు రోజు చాలా స్పెషల్ షోస్ వేశారు ఈ సినిమాకెందుకు ఆలా చెయ్యట్లేదు ?
‘పెళ్లి చూపులు’ విడుదల సంయమలో సినిమా ఫై కొన్ని సందేహాలు ఉన్నాయి. స్పెషల్ షోస్ వేయడం ద్వారా అవి తొలగి మాకు చాలా లాభం జరిగింది. ఈ చిత్రానికి రెండు షోస్ వేశాం కానీ సురేష్ బాబు గారు ఇక స్పెషల్ షోస్ అవసరం లేదు మన సినిమా కి అనుకున్నంత బిజినెస్ జరిగింది అన్నారు.

ఇలాంటి కామెడీ ఎంటెర్టైనర్ ను ఎంచుకోవడానికి గల కారణం ?
మన జీవితంలో జరిగే సంఘటనలనే సబ్జెక్టుగా ఎన్నుకొని సినిమాలు తీస్తాను నేను. నాకు తెలిసి తెలుగులో ఇలాంటి సబ్జెక్ తో సినిమా ఎప్పుడు రాలేదు. చాలా ఆసక్తికర కథతో ఈ సినిమా ఉండనుంది.

అసలు ఈ చిత్ర కథ దేని గురించి ?

ఈ సినిమా ప్రధానంగా బాధ్యతలు లేని ఒక గ్రూప్ కు చెందిన నలుగురు కుర్రాళ్ల నేపథ్యంలో సాగుతుంది. వీళ్లందురు కలిసి ఎలా జీవితాన్ని దారిలోకి తెచుకున్నారనేదే కథ. అలాగే ఈ చిత్రం ద్వారా మందుకు అలవాటుపడిన యువకుల వల్ల సమాజం మీద ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూపించబోతున్నాను.

బడ్జెట్ విషయంలో సురేష్ బాబు గారు ఏమైనా ఆంక్షలు విధించారా ?
ఈ చిత్రానికి నేను అడిగిందల్లా ఇచ్చారు. ఆయనతో నాకు ఎలాంటి సమస్య రాలేదు. ఈ సినిమా ఎక్కువ భాగం గోవాలో చిత్రీకరించాం. ఈ చిత్రానికి సురేష్ బాబు గారు ఒక్కరే నాకు అన్ని విధాలా చాలా సపోర్ట్ చేశారు.

మీరు ఎందుకు ఎప్పుడూ సాధారణంగా ఉండాలనుకుంటున్నారు ?
నాకు ఫేమస్ కావడం ఇష్టం లేదు. దానివల్ల మంచి జరగొచ్చు చెడు జరగొచ్చు. సోషల్ మీడియాలో ఎవరైనా నన్ను ట్రాషింగ్ చేస్తే చూడలేను. నేను మధ్య తరగతి వాడిని. నా ఆలోచనలు కూడ అలాగే ఉంటాయి. అందుకే నా కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతాను .

ఎందుకు కొత్తవారినే తీసుకున్నారు ఈ చిత్రానికి ?
నాకు సంబంధించినంత వరకు కథనే నాకు చాలా ఇంపార్టెంట్. నేను స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి ఇదొక కారణం. స్టార్ హీరోస్ కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా కథ అల్లుకొని సినిమా చేయలేను.ఈ సినిమాలో కొత్త వాళ్ళను ఎన్నుకోవాడిని రెండు నెలలు సమయం పట్టింది. ఇక ఈ చిత్రంలో అందరూ బాగా చేశారు. వాళ్ళ నటనతో అందరిని ఆకట్టుకుంటారు .

మీ తరువాతి చిత్రం గురించి ?

నా నెక్స్ట్ సినిమాని కూడా సురేష్ ప్రొడక్షన్స్ లోనే చేయనున్నాను. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కథ రెడీ అయ్యాక త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తా. ఇప్పుడైతే నా రెండవ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు