ముఖ్య అంశాలు
- 2026 వేలంలో రూ. 25.20 కోట్లు పెట్టి కామెరూన్ గ్రీన్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్, అతనికి సరైన పాత్ర ఇవ్వడంలో తీవ్రంగా తడబడింది.
- చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు కొన్న అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ యాజమాన్యం ఒత్తిడికి, వ్యూహాత్మక లోపాలకు చిత్తయ్యారు.
- సన్‌రైజర్స్ తీసుకున్న లివింగ్‌స్టోన్ లాంటి స్టార్లను వారి బలానికి తగ్గట్టుగా కాకుండా ఇష్టమొచ్చిన స్థానాల్లో ఆడించి ఫ్రాంఛైజీలు చేతులు కాల్చుకున్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. వేలం టేబుల్ దగ్గర ఫ్రాంఛైజీల ఓనర్లు చూపించిన ఉత్సాహం.. తీరా మైదానంలో వ్యూహాల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడా కనిపించలేదు. వందల కోట్లు కుమ్మరించి స్టార్లను కొనుగోలు చేసిన జట్లు, వారిని వాడుకోవడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యాయి. ఆటగాళ్ల ఫామ్ కన్నా మేనేజ్‌మెంట్ నిర్ణయాలే ఈసారి ఎక్కువగా విమర్శలపాలయ్యాయి.
ఈ ఏడాది అందరి దృష్టీ కోల్‌కతా నైట్‌రైడర్స్ మీదే పడింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది. కానీ అతన్ని ఎలా వాడుకోవాలో కేకేఆర్ కెప్టెన్, కోచ్‌లకు ఏమాత్రం క్లారిటీ లేకపోయింది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా పంపాలో లేక ఫినిషర్‌గా దించాలో తేల్చుకోలేక పదే పదే ఆర్డర్ మార్చేశారు. అటు బౌలింగ్‌లోనూ పవర్‌ప్లేలో వాడకుండా మిడిల్ ఓవర్లలో ప్రయోగాలు చేశారు. రోల్ క్లారిటీ కరవవడంతో గ్రీన్ తీవ్రంగా తడబడ్డాడు. తీరా కొన్ని మ్యాచ్‌ల తర్వాత అతన్ని ఏకంగా బెంచ్ మీద కూర్చోబెట్టి కేకేఆర్ తమ అభద్రతాభావాన్ని బయటపెట్టుకుంది.
సాధారణంగా యువ ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా ఈసారి గాడి తప్పింది. అన్‌క్యాప్‌డ్ ఆల్‌రౌండర్లు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ కోసం ఏకంగా చెరో రూ. 14.20 కోట్లు కుమ్మరించింది. అంత భారీ ధర పలకడంతో వారిపై సహజంగానే అంచనాలు పెరిగాయి. కానీ తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమవ్వగానే మేనేజ్‌మెంట్ వారిని పక్కన పెట్టేసింది. వారి బలాలు తెలుసుకుని, స్థిరమైన బ్యాటింగ్ పొజిషన్ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితీ ఇలాగే తయారైంది. ఇంగ్లాండ్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను రూ. 13 కోట్లు పెట్టి దక్కించుకుంది. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే అతడిని టాపార్డర్‌లో పంపకుండా, కేవలం ఆఖరి రెండు మూడు ఓవర్ల కోసమే వాడుకున్నారు. దీంతో అతడి పూర్తి సామర్థ్యాన్ని సన్‌రైజర్స్ వినియోగించుకోలేకపోయింది.
అంతిమంగా ఈ ఐపీఎల్ 2026 సీజన్ నేర్పిన పాఠం ఒక్కటే. కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొన్నంత మాత్రాన మ్యాచ్‌లు గెలవలేరు. వాళ్ల బలాలు ఏంటి, ఏ పరిస్థితుల్లో ఎలా వాడుకోవాలి అనే కనీస వ్యూహం కోచింగ్ స్టాఫ్‌కు ఉండాలి. లేదంటే ప్రతి ఏడాదీ వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు కావాల్సిందే!


