IPL 2026 Match 1: కోహ్లీ మాస్ ఫినిషింగ్, పడిక్కల్ దండయాత్ర.. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ చిత్తు!

IPL 2026 Match 1: కోహ్లీ మాస్ ఫినిషింగ్, పడిక్కల్ దండయాత్ర.. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ చిత్తు!

Published on Mar 28, 2026 11:33 PM IST

kohil

KEY TAKEAWAYS (ముఖ్య అంశాలు)

  • ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను చిత్తుగా ఓడించి బోణీ కొట్టింది.
  • మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ (80) రాణించడంతో 201 పరుగుల భారీ స్కోరు సాధించింది.
  • 202 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ (69*), దేవదత్ పడిక్కల్ (61) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో కేవలం 15.4 ఓవర్లలోనే ఊదేశింది.

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ 2026 సీజన్ బ్లాక్ బస్టర్ మ్యాచ్‌తో మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్‌లోనే తమ ప్రతాపం చూపించింది. హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 6 వికెట్ల తేడాతో దారుణంగా ఓడించి, టోర్నీలో సగర్వంగా బోణీ కొట్టింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం బ్యాటర్ల ఆధిపత్యమే కనిపించింది.

ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ను ఆదిలోనే దెబ్బతీసింది. డెబ్యూటెంట్ జాకబ్ డఫ్ఫీ తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేయడంతో పవర్‌ప్లేలోనే హైదరాబాద్ టాప్ ఆర్డర్ తడబడింది. అయితే, స్టాండ్-ఇన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80), క్లాసెన్ (31) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. చివర్లో కుర్ర బ్యాటర్ అనికేత్ వర్మ కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులు చేసి స్కోర్ బోర్డును ఉరికించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో డఫ్ఫీ, రొమారియో షెపర్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

ఇక 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బెంగళూరుకు బ్యాటర్లు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. ఫిల్ సాల్ట్ త్వరగానే పెవిలియన్ చేరినా.. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి స్టాండ్స్‌ను హోరెత్తించగా, కెప్టెన్ రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31) కూడా తన మార్క్ హిట్టింగ్ చూపించాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన కోహ్లీ.. తనదైన శైలిలో సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వరుస బౌండరీలతో మ్యాచ్‌ను ముగించిన విరాట్.. కేవలం 38 బంతుల్లోనే అజేయంగా 69 పరుగులు చేసి మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు