ఇటీవలి కాలంలో సినిమాల రిలీజ్ డేట్లను ఓటీటీ సంస్థలే శాసిస్తున్నాయి. అగ్రిమెంట్ చేసుకున్న తేదీకే థియేటర్లలోకి తీసుకురావాలని, ఒకవేళ రిలీజ్ వాయిదా వేస్తే ఒప్పందం రద్దు చేసుకుంటామని కఠినంగా వ్యవహరిస్తున్నాయి. బ్లాక్బస్టర్ హిట్ సాధించిన ‘ఇరుముడి’ చిత్రానికి కూడా సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది.
ఆగస్టు 26న రాబోతున్న ‘టాక్సిక్’ సినిమా పోటీకి భయపడి నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని వారం రోజులు వాయిదా వేయాలని భావించారు. కానీ డిజిటల్ రైట్స్ తీసుకున్న నెట్ఫ్లిక్స్ అందుకు అస్సలు ఒప్పుకోలేదు. అగ్రిమెంట్ ప్రకారం ఆగస్టు 21నే రిలీజ్ చేయాలని నెట్ఫ్లిక్స్ స్పష్టం చేయడంతో వేరే దారి లేక నిర్మాతలు అదే తేదీకి ‘ఇరుముడి’ని థియేటర్లలోకి తెచ్చారు.
అయితే నెట్ఫ్లిక్స్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయమే ‘ఇరుముడి’ చిత్రానికి తిరుగులేని వరంగా మారింది. బాక్సాఫీస్ వద్ద ‘ఇరుముడి’ సంచలన విజయం సాధించగా, ఆ తర్వాత వచ్చిన ‘టాక్సిక్’ తీవ్రంగా నిరాశపరిచింది. ఒకవేళ సినిమా వాయిదా పడి ఉంటే ఫలితం తేడా కొట్టేదేమో. ఇక థియేటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.


