‘దాదా’ కూడా మరో ఆలోచనలో ఉన్నాడా..?

‘దాదా’ కూడా మరో ఆలోచనలో ఉన్నాడా..?

Published on Nov 28, 2026 10:02 PM IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ‘దాదా’ సినిమా విడుదలపై ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. డిసెంబర్ 24న విడుదల కావాల్సిన ఈ చిత్రం సంక్రాంతి బరిలోకి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దర్శకుడు గోపిచంద్ మలినేని వాయిదా ఉండదని స్పష్టం చేసినప్పటికీ, ప్రస్తుతం చివరి దశ షూటింగ్ డిసెంబర్ 10 వరకు సాగనుండటంతో సమయం సరిపోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా ప్రమోషన్లు ఊపందుకోకపోవడం, టీజర్, ట్రైలర్ అప్‌డేట్స్ లేకపోవడం అభిమానులను ఆలోచనలో పడేసింది. అయితే, డిసెంబర్ 16న ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు నిర్మాత వెంకట సతీష్ కిలారు ముందుగా అనుకున్న డిసెంబర్ 24 డేట్ కే మొగ్గు చూపుతున్నారట. కానీ క్రిస్మస్ బరిలో హాలీవుడ్ చిత్రాలతో పాటు ‘కింగ్ 100’, ‘కింగ్’, కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ వంటి సినిమాలతో తీవ్ర పోటీ నెలకొంది.

ఒకవేళ పనులు ఆలస్యమై ‘దాదా’ సంక్రాంతికి మారితే, గతంలో మాదిరిగానే మరోసారి బాక్సాఫీస్ వద్ద చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ పోరును చూసే అవకాశం ఉంటుంది. సంక్రాంతి సెంటిమెంట్ బాలయ్యకు బాగా కలిసొచ్చిన నేపథ్యంలో అభిమానులు కూడా పండగ విడుదలను ఆశిస్తుండగా, ప్రస్తుతానికైతే చిత్రబృందం పబ్లిసిటీ వేగాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాజా వార్తలు