‘మజిలీ’లో ఎవర్‌ గ్రీన్‌ క్లాసిక్ చిత్రాల ఛాయలు !

Published on Apr 7, 2019 12:47 am IST

చైతు – సామ్ మజిలీకి మంచి పాజిటివ్ టాక్ రావడం, దానికి తోడు సినిమాలో చైతు నటన సినిమాకే హైలెట్ నిలవడంతో మొత్తానికి చాలా సినిమాల తర్వాత చైతుకి మంచి హిట్ వచ్చింది. అయితే మజిలీలో రెండు ఎవర్‌ గ్రీన్‌ క్లాసిక్ చిత్రాల ఛాయలు కనిపిస్తోన్నాయి. మౌన రాగం, సాగరసంగమం చిత్రాల్లోని ప్రధాన ప్లాట్ తో పాటు పాత్రలు కూడా ‘మజిలీ’కి ప్రేరణగా నిలిచినట్లు అనిపిస్తోంది.

ముందుగా ‘మౌనరాగం’లోని కథకు ‘మజిలీ’ కథ చాలా దగ్గరిగా ఉంది. దానికి కారణం రెండు సినిమాల్లోని పాత్రాలు దాదాపు ఒకేలా ఉండటమే. ‘మజిలీ’లో హీరో ప్రేమ మత్తులో భార్యను పట్టించుకోకుండా తాగుతూ తిరుతుంటాడు, అదే విధంగా ‘మౌనరాగం’లో కూడా హీరోయిన్ ప్రేమ మత్తులో ప్రియుడి జ్ఞాపకాలతో భర్తను పట్టించుకోకుండా బాధ పడుతూ కూర్చుంటుంది. ఇక ‘మజిలీ’లో భార్య, భర్త ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటే.. ‘మౌనరాగం’లో కూడా భర్త, భార్య ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ రకంగా రెండు సినిమాల్లోని కథ, పాత్రలు ఒకేలా ఉండటం గమనార్హం.

ఇక ‘సాగరసంగమం’లో హీరో జీవితానికి మజిలీలోని హీరో జీవితానికి కూడా చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. రెండు సినిమాల్లోని హీరోలు తాము ప్రేమించిన అమ్మాయిని మరచిపోలేక, జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆమె పై ఇష్టం తగ్గక.. చివరికి పచ్చి తాగుబోతుగా జీవితాన్ని వృధా చేసుకుంటారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం తాము ప్రేమించిన అమ్మాయి కూతురికే.. తమకు తెలిసిన విద్య నేర్పుతూ.. తిరిగి మాములు మనుషులు అవ్వటానికి ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ‘మజిలీ’లో ‘మౌన రాగం, సాగరసంగమం’ లాంటి ఎవర్‌ గ్రీన్‌ క్లాసిక్ చిత్రాల ఛాయలు ఉండటం కొసమెరుపు.

సంబంధిత సమాచారం :