పైరసీ భూతం: కంటెంట్ లీక్ అవుతోంది అక్కడే.. అడ్డుకట్ట వేయాల్సింది ఇక్కడే!

పైరసీ భూతం: కంటెంట్ లీక్ అవుతోంది అక్కడే.. అడ్డుకట్ట వేయాల్సింది ఇక్కడే!

Published on Dec 24, 2025 10:30 AM IST

Piracy

ప్రముఖ పైరసీ(Piracy) ప్లాట్‌ఫారమ్ ‘iBomma’తో సంబంధం ఉన్న ఇమ్మడి రవి అరెస్ట్ కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రెస్ మీట్ లు, సోషల్ మీడియాలో చర్చలు, సినీ ప్రముఖుల ఆగ్రహం.. ఇలా కొద్దిరోజుల పాటు హడావుడి సాగింది. కానీ, ఎప్పటిలాగే ఆ హడావిడి త్వరగానే సద్దుమణిగింది. అయితే, ఇక్కడ మారిన విషయం ఏమీ లేదు. అరెస్టులు జరిగినా పైరసీ మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.

పైరసీ అనేది కేవలం ప్రేక్షకుల నైతిక ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని అనుకోవడం పరిశ్రమ తన తప్పును కప్పిపుచ్చుకోవడమే అవుతుంది. వ్యవస్థలో ఉన్న లొసుగుల వల్లే పైరసీ వేళ్లూనుకుంటోంది తప్ప ఇది కేవలం శాంతిభద్రతల సమస్య కాదు. ముఖ్యంగా OTT ప్లాట్‌ఫారమ్‌ల భద్రతా వ్యవస్థల్లో ఉన్న బలహీనతలే దీనికి ప్రధాన కారణమని చెప్పాలి.

నియంత్రణ సాధ్యం.. నిరూపించిన ‘ఈటీవీ విన్’

పైరసీని(Piracy) ఆపడం అసాధ్యం అనే వాదన తప్పని ఒక ప్రాంతీయ OTT సంస్థ నిరూపించింది. తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ‘ఈటీవీ విన్’ తన కంటెంట్‌ను రక్షించుకోవడానికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమాలు విడుదలైన తొలి రోజుల్లో బ్రౌజర్ (వెబ్‌సైట్) యాక్సెస్‌ను నిలిపివేసి, కేవలం మొబైల్ యాప్స్ మరియు స్మార్ట్ టీవీలకే పరిమితం చేసింది. దీని ఫలితం అద్భుతంగా ఉంది. ‘క’, ‘అనగనగా’, ‘AIR’ వంటి చిత్రాలు విడుదలైన తొలి రోజుల్లో పైరసీ సైట్లలో కనిపించలేదు. ఇది ప్రేక్షకుల నిజాయితీ వల్ల జరిగిన మార్పు కాదు.. సాంకేతిక నియంత్రణ వల్ల వచ్చిన మార్పు. కంటెంట్‌ను యాక్సెస్ చేసే మార్గాలను కఠినతరం చేస్తే పైరసీని కచ్చితంగా ఆలస్యం చేయవచ్చని ఇది నిరూపించింది.

OTT సంస్థల బాధ్యత ఎక్కడ?

ఒక చిన్న ప్రాంతీయ ప్లాట్‌ఫారమ్ చేయగలిగిన పనిని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి గ్లోబల్ దిగ్గజాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? వేల కోట్లు వెచ్చించి కంటెంట్‌ను కొనుగోలు చేసే ఈ సంస్థలు, భద్రత విషయంలో మాత్రం అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. చందాదారుల సంఖ్య పెంచుకోవడం పై ఉన్న శ్రద్ధ, కంటెంట్ లీక్ అవ్వకుండా చూడటంలో కనిపించడం లేదు. థియేటర్ రన్ తగ్గించి డిజిటల్ ప్రీమియర్‌లకు ప్రాధాన్యత ఇస్తున్న నిర్మాతలు, ఈ భద్రతా లోపాల వల్ల భారీగా నష్టపోతున్నారు. బలమైన DRM (డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్) వ్యవస్థలు, నియంత్రిత యాక్సెస్ పద్ధతులు అమలు చేయనంత కాలం పైరసీ(Piracy) వర్ధిల్లుతూనే ఉంటుంది. కాబట్టి, పైరసీకి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత పూర్తిగా OTT ప్లాట్‌ఫారమ్‌లదే!

Also Read : బాక్సాఫీస్ వార్నింగ్: కంటెంట్ లేకపోతే కటౌట్ ఉన్నా వేస్టే.. 2025లో స్టార్ హీరోలకు గట్టి షాక్!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు