సాధారణంగా ‘స్టార్ పవర్’ (Star Power) అంటే ఏమిటి? ఒక స్టార్ హీరో సినిమా ప్రమోషన్స్, ప్రీ-రిలీజ్ కంటెంట్, హీరో ట్రాక్ రికార్డు, డైరెక్టర్ క్రేజ్ తదితర అంశాలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ నంబర్స్‌తో ఓపెన్ అయితే.. అది ఖచ్చితంగా ఆ హీరోకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అనే చెప్పాలి. దీన్నే స్టార్ పవర్ అంటారు. అయితే, ప్రస్తుతం బాక్సాఫీస్ తీరును పరిశీలిస్తే గతంలో మాదిరిగా లేదు. అప్పట్లో ఒక స్టార్ హీరో సినిమా ప్రీ-రిలీజ్ ప్రమోషనల్ కంటెంట్, రివ్యూలు, మౌత్ టాక్‌లతో సంబంధం లేకుండా తొలి వీకెండ్‌లో సాలిడ్ నంబర్స్ రాబట్టేవి. సదరు హీరో ఇమేజ్‌పై నిర్మాతలు ధైర్యంగా ఉండేవారు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
2025 బిగ్ షాక్ – చతికిలబడ్డ భారీ బడ్జెట్ చిత్రాలు (Star Power):
2025 ఏడాదిలో బాక్సాఫీస్ దగ్గర చాలా మంది స్టార్ హీరోలు సరైన ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో విఫలమయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘వార్-2’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ లాంటి ప్రెస్టీజియస్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ దగ్గర చతికిలబడ్డారు. తెలుగు సినిమాలో వీరందరు తిరుగులేని హీరోలు. అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఈ హీరోలను చూసి టికెట్లు తెగుతాయి. కానీ, వారు నటించిన ఈ చిత్రాలు వారి క్రేజ్‌ను ఏమాత్రం అందుకోలేకపోయాయి. దీన్నిబట్టి దర్శకనిర్మాతలు ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే, మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది.
కేవలం ఫ్యాన్స్ కోసం తీస్తే సరిపోదు:
అసలు సమస్య ఎక్కడ ఉంది? ఇప్పుడు దర్శకనిర్మాతలు ఫోకస్ చేయాల్సిన ఒకే ఒక విషయం.. “కంటెంట్” (Content). హీరో ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టు కంటెంట్ లేకపోతే సినిమా మొదటి రోజే తేడా కొట్టేస్తుంది. కేవలం ఫ్యాన్స్ (Fans) కోసం సినిమాలు తీస్తే సరిపోదు. న్యూట్రల్ ఆడియన్స్ (సాధారణ ప్రేక్షకులు) కూడా థియేటర్ కు రావాలి. ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడు అది అందరికీ నచ్చాలి. కేవలం ఫ్యాన్స్ కు నచ్చి, సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే ఓపెనింగ్స్ రావడం కష్టమని ఈ సినిమాలు నిరూపించాయి.
ఈ కొత్త ట్రెండ్ ని అర్థం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్. 2025లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG) సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. ఏకంగా రూ.140 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి రికార్డులు తిరగరాసింది. కానీ, అదే పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాకు అందులో సగం ఓపెనింగ్స్ కూడా రాలేదు. రెండూ భారీ బడ్జెట్ చిత్రాలే, ఒకే హీరో. కానీ ఫలితంలో ఇంత తేడా ఎందుకు? కారణం ఒక్కటే.. ‘ఓజీ’ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులను, సామాన్య ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే ‘హరిహర వీరమల్లు’ ఆ విషయంలో విఫలమైంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. రిలీజ్ కు ముందే సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో కంటెంట్ దే ప్రధాన పాత్ర.
మారకపోతే మునగడం ఖాయం
ఇప్పటికే టికెట్ రేట్లు (Ticket Prices) పెరగడం, ఓటీటీ (OTT)లో సినిమాలు త్వరగా వచ్చేస్తుండటంతో జనం థియేటర్లకు రావడం తగ్గించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేవలం స్టార్ ఇమేజ్‌ని నమ్ముకుంటే కుదరదు. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తేనే జనం థియేటర్లకు క్యూ కడతారు. అందుకే దర్శకనిర్మాతలు ఇకనైనా మారాలి. ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలి. 2025 టాలీవుడ్‌కు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ‘స్టార్‌డమ్ అనేది సినిమాను థియేటర్ వరకు తీసుకువస్తుంది, కానీ కంటెంట్ మాత్రమే సినిమాను గట్టెక్కిస్తుంది!’


