పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజంటే అభిమానులకు మామూలు పండగ కాదు. గత రెండు రోజుల నుంచే పవన్ అభిమానులు తమ హీరో జపం మొదలుపెట్టారు. రేపు (సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. పుట్టినరోజు వేడుకలకు పవన్ కళ్యాణ్ సాధారణంగానే దూరంగా ఉంటారు. అయితే ఆయన అభిమానులు మాత్రం అప్పుడే సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ సందడి చేస్తున్నారు. ఇక పవన్ పుట్టిన రోజు సందర్భంగా పలు సినీ దర్శకులు కూడా తమ సినిమా టీజర్స్‌ను పవన్ బర్త్‌డే ట్రీట్‌గా విడుదల చేయనుండడం కూడా విశేషంగా కనిపిస్తోంది.
ఇప్పటికే ఈ ఉదయం పవన్ పుట్టినరోజుకు ఒకరోజు ముందే వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీజర్ ఒకటి ఈ అర్థరాత్రి విడుదల కానుంది. ఇదే కోవలో రామ్ చరణ్ – శ్రీనువైట్లల కాంబినేషన్లో రూపొందుతోన్న ‘బ్రూస్ లీ’, సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొంది, త్వరలో విడుదలకి సిద్ధమైన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, నిఖిల్ ‘శంకరాభరణం’.. ఇలా మెగా హీరోల సినిమాల టీజర్సే కాకుండా ఇతర హీరోల టీజర్స్ కూడా పవన్ బర్త్‌డేకి విడుదల కానుండడం ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం. పవన్ ఎప్పట్లాగే పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నా, అభిమానులు మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు ప్లాన్ చేస్తున్నారు.


