సక్సెస్ టూర్‌కు అల్లరోడి ‘జేమ్స్ బాండ్’..!

సక్సెస్ టూర్‌కు అల్లరోడి ‘జేమ్స్ బాండ్’..!

Published on Jul 26, 2015 4:49 PM IST

allari-naresh
అల్లరి నరేష్ సినిమాలంటే కామెడీకి ఓ సరికొత్త బ్రాండ్. కామెడీని తనదైన స్టైల్లో ప్రెజెంట్ చేస్తూ, తనకొచ్చిన బ్రాండ్‌ను మరింత పెంచుకుంటూ వచ్చిన నరేష్ ఈమధ్య కాలంలో మాత్రం తనదైన సినిమా చేయలేకపోయారు. తాజాగా ఆయన హీరోగా నటించిన మరో కామెడీ సినిమా ‘జేమ్స్‌ బాండ్’ ఆ లోటును తీర్చే సినిమాగా ప్రచారం పొందుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం పరిచయమయ్యారు.

గత రెండు వారాలుగా బాహుబలి సినిమా తప్ప మరో సినిమా విడుదల కాని నేపథ్యంలో శుక్రవారం విడుదలైన ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్నిచోట్లా ఈ అల్లరి మార్క్ ఎంటర్‌టైనర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ సినిమాలకు ఎప్పుడూ రానంతగా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. జేమ్స్ బాండ్.. ‘నేను కాదు నా పెళ్ళాం’ అన్న ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సినిమాలో సాక్షి చౌదరి అల్లరి నరేష్‌‍ను ఇబ్బందుల్లో పడేసే భార్యగా నటించింది.

ఇక సినిమాకు మంచి టాక్ రావడం, ఓపెనింగ్స్ కూడా బాగుండటంతో ‘జేమ్స్ బాండ్’ యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రేపట్నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రధాన ప్రాంతాల్లో సక్సెస్ టూర్ నిర్వహించేందుకు జేమ్స్ బాండ్ టీమ్ ప్లాన్ చేసింది. ఈ టూర్‌కు హీరో, హీరోయిన్లతో పాటు దర్శకుడు, మిగతా యూనిట్ కూడా పాల్గొననున్నారు. రేపు (జూలై 27) మార్నింగ్ షోతో శ్రీకాకుళంలో మొదలుకానున్న ఈ సక్సెస్ టూర్, ఎల్లుండి (జూలై 28) సాయంత్రం రాత్రి షోతో గుంటూరులో ముగియనుంది.

ఈ రెండు రోజుల్లో విజయనగరం, విశాఖపట్టణం, తుని, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ తదితర ప్రాంతాల్లో సక్సెస్ టూర్ జరగనుంది. ఈ టూర్ తర్వాత త్వరలోనే నైజాం, సీడెడ్ ప్రాంతాల్లోనూ సక్సెస్ టూర్ నిర్వహించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.

తాజా వార్తలు