యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారెజ్’ సినిమాపై అభిమానుల్లో ఇప్పట్నుంచే ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌తో అభిమానులంతా సినిమాపై అంచనాలను పెంచేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేలా ఓ టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు జనతా గ్యారెజ్ టీమ్ చెప్పినా, ఆ టీజర్ ఎప్పుడు విడుదలవుతుందనేది మాత్రం స్పష్టం చేయలేదు.
ఇక తాజాగా దర్శకుడు కొరటాల శివ, కొద్దిసేపటి క్రితం టీజర్ విడుదల తేదీని ప్రకటించేశారు. జూలై 6న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇక టీజర్ కోసం ఓపికగా ఎదురుచూస్తోన్న అభిమానులందరికీ కొరటాల శివ ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా ఆగష్టు 12న విడుదల కానుంది.


