నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే సినిమాల్లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘సమరసింహారెడ్డి’ ముందుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 1999లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ తెలుగులో సూపర్ హిట్ అయిన రీమేక్స్ మీద దృష్టి పెట్టి వాటితో అక్కడ సూపర్ హిట్స్ అందుకుంటున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే..
తాజాగా మరో బాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘సమరసింహారెడ్డి’ రీమేక్ రైట్స్ ని కొనుగోలు చేసింది. ‘సమరసింహారెడ్డి’ సినిమాని సుమారు ఒక కోటి రూపాయలకు కొనుకున్నారు. అలాగే రీమేక్ రైట్స్ కొనుక్కున్న సంస్థ ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రకి జాన్ అబ్రహం ని పరిశీలిస్తోంది. కానీ జాన్ అబ్రహం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సమరసింహారెడ్డి సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి ఫాదర్ అయిన విజయేంద్ర ప్రసాద్ కథని అందించగా బి. గోపాల్ దర్శకత్వం వహించాడు. ఈ కథని బాలీవుడ్ లో ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఎవరెవరు నటిస్తారు అనే విషయాలు మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.


