యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘కత్తి’ చిత్రం రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారా..? చెన్నై మీడియా నుండి అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గోవాలో ఉన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ నెల 24 వరకు గోవాలో చిత్రీకరణ జరుగుతుంది. హైదరబాద్ తిరిగి రాగానే ‘కత్తి’ చిత్రం చూసి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా ‘కత్తి’ రీమేక్ లో నటించవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తొలుత పవన్ హీరోగా ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి నిర్మాత ఠాగూర్ మధు ప్రయత్నించారు. పవన్ ఆసక్తి చూపకపోవడంతో ఈ నెల 21న డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. తాజాగా విడుదల సందిగ్దంలో పడింది. ఓ అగ్ర కధానాయకుడితో రీమేక్ చేయడానికి మధు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తమిళంలో సుమారు 100 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ఇంకా తెలుగులో విడుదల చేయలేదు.
ఇళయ దళపతి విజయ్, సమంత జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కత్తి’. దీపావళి కానుకగా తమిళనాడులో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధిచింది. ప్రస్తుతం రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను, కార్పొరేట్ కంపెనీల ఆగడాలను ఈ చిత్రంలో ప్రస్తావించారు.


