
‘టెంపర్’ విజయంతో జోష్ మీదున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆ వెంటనే మరో మాస్ కమర్షియల్ సినిమా కాకుండా, తన స్టైల్లోనే జ్యోతిలక్ష్మీ పేరుతో డిఫరెంట్ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఛార్మీ హీరీయిన్‌గా నటించడంతో పాటు నిర్మాణంలోనూ భాగం పంచుకొని చేసిన ఈ సినిమా జూన్ 5న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. పూరీ జగన్నాథ్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించడం, మంచి ఆసక్తి రేకెత్తించే ట్రైలర్ చూసాక సాధారణంగానే అభిమానులు ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు అప్పుడే సీక్వెల్ ప్లాన్ చేశారు పూరీ జగన్నాథ్. ఇప్పటికే జ్యోతిలక్ష్మీ 2కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైందట. అయితే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ నితిన్, చిరంజీవి, మహేష్‌ల సినిమాలకు కమిటై ఉండడంతో ఆ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాక గానీ జ్యోతిలక్ష్మీ 2 సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం లేదని తెలుస్తోంది. సి. కళ్యాణ్ జ్యోతిలక్ష్మీ సినిమాకు మరో నిర్మాతగా ఉన్నారు.

