
ఇటీవలే విడుదలైన ‘టెంపర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మొట్ట మొదటి సారిగా దర్శకత్వం వహిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘జ్యోతిలక్ష్మీ’. ప్రముఖ హీరోయిన్ చార్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. బోల్డ్ కాన్సెప్ట్ తో రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి మొదలు కానుంది. ఛార్మీ ఈ సినిమాలో ఓ వేశ్య పాత్రలో కనిపించనుందని, తన చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుందని సమాచారం.
తాజాగా ఈ చిత్ర డైరెక్టర్ పూరి జగన్నాధ్ నేడు మహిళ దినోత్సవ సందర్భంగా జ్యోతి లక్ష్మీ మోషన్ పోస్టర్ మరియు ఫస్ట్ టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నామని తెలియజేశారు. మల్లాడి వెంకట కృష్ణమూర్తి రచించిన ప్రసిద్ద నవలా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు పూరి తెలిపారు. ఈ సినిమా కోసం స్ట్రిక్ట్ డైట్ మైంటైన్ చేసిన ఛార్మి కొంచం వెయిట్ తగ్గింది. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పణలో శ్రీ శుభ శ్వేతా ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా త్వరగా ఈ సినిమా షూట్ ని ఫినిష్ చేసి సమ్మర్ చివర్లోనే ఈ సినిమా రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.

