విడుదల తేదీ : ఏప్రిల్ 18, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : కళ్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు.
దర్శకుడు : ప్రదీప్ చిలుకూరి
నిర్మాత : అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం : బి. అజనీష్ లోక్ నాథ్
సినిమాటోగ్రఫీ : రామ్ ప్రసాద్
ఎడిటర్ : తమ్మిరాజు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.
కథ :
వైజయంతి (విజయశాంతి) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. రిస్కీ ఆపరేషన్లో సైతం ప్రాణాలకు తెగించి క్రిమినల్స్ పై అటాక్ చేస్తోంది. ఆమెకు ఒక కొడుకు అర్జున్ (కళ్యాణ్ రామ్). అతనికి తల్లి అంటే ప్రాణం. తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని చేయాలనేది ఆమె లక్ష్యం. ఐతే, పరిస్థితులు అర్జున్ ను హంతకుడిని చేస్తాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అర్జున్ క్రిమినల్స్ ను అంతం చేయడానికి చేసిన క్రైమ్ ఏమిటి ?, ఈ క్రమంలో తన తల్లి దృష్టిలో అర్జున్ హంతకుడిగా ఎలా అవుతాడు ?, ఈ మధ్యలో కమిషనర్ ప్రకాష్ (శ్రీకాంత్) పాత్ర ఏమిటి ?, చివరికి తల్లీ కొడుకులు కలిశారా ? లేదా ?, ప్రాణంగా ప్రేమించే తన తల్లి కోసం అర్జున్ చేసిన త్యాగం ఏంటి ?, అలాగే.. అర్జున్ ప్రేమను వైజయంతి చివరకు అర్ధం చేసుకుందా ? లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. వైల్డ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ కళ్యాణ్ రామ్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. కళ్యాణ్ రామ్ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో ముఖ్యంగా క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. తల్లి వైజయంతి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. కొన్ని రిస్కీ యాక్షన్ షాట్స్ లోనూ ఆమె తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు.
హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో కూడా సెటిల్డ్ గా నటిస్తూ ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ కూడా మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన సోహైల్ ఖాన్ నటన బాగుంది. ముఖ్యంగా అతని ఎంట్రీ సీన్ చాలా బాగుంది. బబ్లూ పృథ్వీరాజ్ కూడా బాగా నటించాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. విజయశాంతి – కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి.
దర్శకుడు ప్రదీప్ చిలుకూరి రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. అలాగే, కళ్యాణ్ రామ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు.
మైనస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్ పోషించిన అర్జున్ పాత్రను, ఆ పాత్ర తాలూకు మదర్ సెంటిమెంట్ ను బాగా డిజైన్ చేసుకున్న ప్రదీప్, అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను కొత్తగా రాసుకోలేదు. కొన్నిచోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు రెగ్యులర్ గా సాగాయి. నిజానికి సెకండాఫ్ స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్ బాగున్నా.. మిగిలిన ప్లేలో కూడా ఉత్సుకతను పెంచి ఉంటే బాగుండేది. అలాగే హీరో -హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్నాథ్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
తీర్పు :
“అర్జున్ సన్నాఫ్ వైజయంతి” అంటూ వచ్చిన ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. ‘కళ్యాణ్ రామ్ – విజయశాంతి’ల నటన, యాక్షన్ సీన్స్ మరియు మదర్ సెంటిమెంట్, అలాగే కళ్యాణ్ రామ్ పాత్ర తాలూకు ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్ గా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని చివరి వరకు ఎంగేజ్ చేస్తోంది. మొత్తమ్మీద ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team