‘కళ్యాణ వైభోగమే’ ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్‌కు రెడీ!

naga-showrya
వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న యువహీరో నాగశౌర్య, తాజాగా ‘అలా మొదలైంది’తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో ‘కళ్యాణ వైభోగమే’ అనే సినిమాతో సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక్క స్టిల్ గానీ, పోస్టర్ గానీ ఇప్పటికీ విడుదల కాకపోవడంతో కళ్యాణ వైభోగమే ఎలా ఉండనుందనేది ఆసక్తికర ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే సినిమా యూనిట్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసి సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలని భావిస్తోంది.

ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ టీజర్‌ను ఇప్పటికే దాదాపుగా సిద్ధం చేసేశామని, త్వరలోనే వీటిని రిలీజ్ చేస్తామని నందిని రెడ్డి తెలియజేశారు. దీపావళి కానుకగా ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తన రెండో సినిమా ‘జబర్దస్త్’ అనుకున్నంత బాగా సక్సెస్ సాధించకపోవడంతో ‘కళ్యాణ వైభోగమే’ విషయంలో నందిని రెడ్డి మొదట్నుంచీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. కళ్యాణ్ కోడూరి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఈ సినిమాకు ఓ హైలైట్‌గా చెబుతూ వస్తోన్న టీమ్, ఈ నెల్లోనే ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేస్తోంది. నాగశౌర్య సరసన ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దామోదర్ ప్రసాద్ నిర్మించారు.

Exit mobile version