ఇంటర్వ్యూ : కామాక్షి భాస్కర్ల – ‘అగధ’ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..!

ఇంటర్వ్యూ : కామాక్షి భాస్కర్ల – ‘అగధ’ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..!

Published on Aug 13, 2026 5:00 PM IST

వైవిధ్యమైన కథలతో రాణిస్తున్న కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదలవుతోంది. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా విడుదల సందర్భంగా కామాక్షి భాస్కర్ల మీడియాతో పంచుకున్న విశేషాలు ఇవే.

శ్యాం ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని అనుష్కతో పోల్చారు? దానిపై మీ స్పందన ఏంటి?

అంత పెద్ద నిర్మాత నన్ను అనుష్క గారితో పోల్చడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మాటలు నాపై మరింత బాధ్యతను పెంచాయి.

‘అగధ’లోని యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పండి?

‘అగధ’లో యాక్షన్ సీన్స్ కోసం ముందే వర్క్ షాప్స్, రిహార్సల్స్ చేశాం. సెట్‌లో చిన్న ఇబ్బందులు ఉన్నా, టీం వర్క్ వల్ల అవుట్ పుట్ బాగా వచ్చింది.

‘అగధ’ జర్నీలో మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి?

మహాదేవి పాత్రలోకి మారడం నాకు పెద్ద సవాలు. కామాక్షిని, నా ఆలోచనలని పక్కనపెట్టి ఆ పాత్రగా మారడానికి బుద్ధిజం పుస్తకాలు చదివి, బ్లాక్ మ్యాజిక్, ముద్రలు మరియు నడక శైలిపై రీసెర్చ్ చేశాను. దేవుడి అనుగ్రహంతో దక్కిన ఈ పాత్రలో ఎక్కడా కామాక్షి కనిపించకుండా నటించాను.

ఎం.ఎస్. రాజు గారి నుంచి ఫోన్ రావడం ఎలా అనిపించింది?

నాకు ఎం.ఎస్. రాజు గారి సినిమాలంటే చాలా ఇష్టం, అందులో ‘మనసంతా నువ్వే’ నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఆయన నన్ను ‘పొలిమేర’లో చూసి ‘అగధ’ కోసం కాంటాక్ట్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన సినిమాల్లో ప్రతి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

‘అగధ’ను అంగీకరించడానికి మీకు నచ్చిన అంశాలు ఏంటి?

రాజు గారి నుంచి పిలుపు వచ్చిందంటేనే అందులో కొత్త పాయింట్, బలమైన పాత్ర ఉంటాయని అర్థమైంది. అందుకే కథ వినకముందే ఆయనపై నమ్మకంతో ఓకే చెప్పేశా. తర్వాత ‘అగధ’ కథ, నా క్యారెక్టర్ విన్నాక ఇంకా బాగా నచ్చాయి. ఫలితాల కంటే వర్క్ ప్రాసెస్‌ను, రాజు గారితో పనిచేసే అనుభవాన్ని ఆస్వాదించడానికే ఈ సినిమా చేశాను.

‘అగధ’లోని హారర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ గురించి చెప్పండి?

‘అగధ’లో హారర్ కంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, డివైన్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సినిమా చివర్లో ప్రేక్షకులకు ఒక మంచి డివైన్ ఫీలింగ్ కలుగుతుంది.

టెక్నికల్ టీం గురించి చెప్పండి?

నాని చమిడిశెట్టి గారి కెమెరా వర్క్, ఆయన చేసిన ప్రయోగాలు రాజు గారి విజన్‌కి ప్రాణం పోశాయి. డీఐ వర్క్ చాలా బాగుంది. రాజీవ్ గారి ఆర్ట్ వర్క్, అమ్మవారి విగ్రహం సెట్స్ తెరపై మ్యాజిక్‌లా అనిపిస్తాయి. ఇక రీ-రికార్డింగ్ అయితే కొన్ని సీన్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.

మున్ముందు దర్శకత్వం వహించే అవకాశం ఉందా?

ఇంతకుముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా, రైటింగ్ టీంలోనూ పనిచేశాను. దర్శకత్వం వహించాలనే ఆలోచన ఉంది కానీ, దానికి ఇంకా చాలా టైమ్ పడుతుంది.

‘అగధ’ విజయంపై మీకున్న నమ్మకం గురించి చెప్పండి?

‘అగధ’ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ముఖ్యంగా రాజు గారి కంబ్యాక్ కోసం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. నేను ఆల్రెడీ సినిమా చూశాను; సెట్‌లో సాధారణంగా అనిపించిన సీన్స్ కూడా స్క్రీన్ మీద అద్భుతంగా వచ్చి నన్ను ఆశ్చర్యపరిచాయి. సినిమా చూస్తున్నంతసేపూ భావోద్వేగంతో కన్నీళ్లు వచ్చాయి, ఆఖరిగా ఎంతో సంతృప్తిగా అనిపించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు