పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసిన కమల్ హాసన్ !

7th, November 2017 - 11:57:18 AM

విశ్వనటుడు కమల్ హాసన్ ఈరోజు 63వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా భారీ స్థాయిలో వేడుకల్ని ప్లాన్ చేశారు. పైగా త్వరలోనే కమల్ రాజకీయ పార్టీని ప్రకటించనుండటంతో ఈ పుట్టినరోజు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. కానీ కమల్ మాత్రం నిన్న రాత్రి తన పుట్టినరోజు వేడుకల్ని రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు.

దీనికి వివరణ ఇస్తూ ‘రేపటిని మనం సద్వినియోగం చేయకపోతే అది కూడా ఒక సాధారణమైన రోజులాగానే మిగిలిపోతుంది. దాన్ని మనం కోరుకుంటున్న మార్పు కోసం ఉపయోగిస్తే బాగుంటుంది’ అన్నారు. అలాగే కమల్ ఈరోజు భారీ వర్షాలకు దెబ్బతిన్న చెన్నైకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవాడి అనే ప్రాంతాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుని సందర్శించనున్నారు.