కమల్, రజనీ కలిసి నటించనిది అందుకే..!

కమల్, రజనీ కలిసి నటించనిది అందుకే..!

Published on May 5, 2015 10:48 AM IST

kamal-haasan-rajinikanth
రజనీ కాంత్, కమల్ హాసన్ ఇద్దరూ తమిళ సినీ పరిశ్రమలో సమాన స్థాయి కలిగిన స్టార్ హీరోలు. తన మార్క్ యాక్టింగ్, స్టైల్‌తో కమర్షియల్ సినిమాలకు కొత్త అర్థాన్ని తెచ్చిన వ్యక్తిగా రజనీని చెప్పుకుంటే, విభిన్న సినిమాలతో సరికొత్త కథాంశాలతో తెరకెక్కే సినిమాల నటుడిగా కమల్ హాసన్ గురించి చెప్పుకుంటాం. వీరిద్దరికీ బాల చందరే గురువు. ఇక వీరిద్దరూ కలిసి గతంలో చాలా సినిమాలకే పనిచేశారు. అయితే మళ్ళీ వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపించి చాలా కాలమే అయింది.

ఇదే విషయం గురించి కమల్ హాసన్ ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. “రజనీ, నేను చాలా సినిమాల్లో కలిసి నటించాం. ఒక సమయంలో నేను, రజనీ ఇద్దరం చెరో 2.5లక్షల రెమ్యునరేషన్ తీసుకునే దశలో ఉన్నాం. అయితే మేమిద్దరం కలిసి నటించిన ఓ సినిమాకి ఇద్దరికీ కలిపి 2.5లక్షలు మాత్రమే ఇచ్చారు. ఈ విషయం ఒకరికొకరికి తెలియకుండా ఏర్పాటు చేసుకున్నారు. నేను, రజనీ ఓసారి ఈ విషయం గురించి మాట్లాడుకుంటే అసలు విషయం బయటపడింది. అప్పుడే ఇక మేమిద్దరం కలిసి నటించకూడదని నిర్ణయించుకొని ప్రెస్‌మీట్ పెట్టి మరీ తెలియజేశాం. నేను, రజనీ ఇద్దరం కలిసి పనిచేయాలంటే నేనో లేదా రజనీయో నిర్మాతగా ఉంటేనే అది సాధ్యం” అని తెలిపారు.

ఇక కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘ఉత్తమ విలన్’ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని గత శనివారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సినీ విశ్లేషకుల నుండి మంచి రివ్యూలే వచ్చాయి.

తాజా వార్తలు