కమల్ హాసన్ vs రజనీ కుమార్తె..!

కమల్ హాసన్ vs రజనీ కుమార్తె..!

Published on Apr 30, 2015 7:35 PM IST

kamal-soundarya

రజనీ కాంత్, కమల్ హాసన్ ఇద్దరూ తమిళ సినీ పరిశ్రమలో సమాన స్థాయి కలిగిన స్టార్ హీరోలు. తన మార్క్ యాక్టింగ్, స్టైల్‌తో కమర్షియల్ సినిమాలకు కొత్త అర్థాన్ని తెచ్చిన వ్యక్తిగా రజనీని చెప్పుకుంటే, విభిన్న సినిమాలతో సరికొత్త కథాంశాలతో తెరకెక్కే సినిమాల నటుడిగా కమల్ హాసన్ గురించి చెప్పుకుంటాం. వీరిద్దరికీ బాల చందరే గురువు. ఇక వీరిద్దరూ కలిసి గతంలో చాలా సినిమాలకే పనిచేశారు. తాజాగా వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికరమైన పోటీ నడుస్తోంది.

ఆ పోటీ డైరెక్ట్‌గా రజనీ, కమల్‌ల మధ్య కాకపోయిన కొందరు అభిమానులు మాత్రం అలానే చెప్పుకుంటున్నారు. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్ ‘3’ అనే సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ సినిమాతో ఆమె దర్శకురాలిగా మంచి గుర్తింపే దక్కించుకుంది. తాజాగా తన రెండో సినిమాగా ‘వాయ్ రాజా వాయ్’ పేరుతో ఓ రొమాంటిక్ థ్రిల్లర్‌ను తెరకెక్కించింది. ‘కడలి’ సినిమా హీరో గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా వేసవి కానుకగా రేపు (మే 1న) విడుదల కానుంది.

ఇక కమల్ హాసన్ నటించి, నిర్మించిన డిఫరెంట్ సినిమా ‘ఉత్తమ విలన్’ కూడా భారీ అంచనాల మధ్య రేపే విడుదల కానుంది. ఆండ్రియా, పూజా కుమార్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రమేష్ అరవింద్ దర్శకుడు. ఈ వీకెండ్‌కి తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలే ప్రధానంగా పోటీ పడడం విశేషంగా కనిపిస్తోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా గెలుస్తుంది? రెండు సినిమాలూ గెలిచి నిలుస్తాయా? అన్నది తేలాలంటే ఈ వారాంతం వరకూ వేచి చూడాల్సిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు