
మోహల్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో 2013లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా ‘దృశ్యం’. ఇక ఈ సినిమాను అదే పేరుతో విక్టరీ వెంకటేష్ తెలుగులో రీమేక్ చేయగా ఇక్కడా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఈ థ్రిల్లర్‌ను అనుభూతి చెందేందుకు తమిళ ప్రేక్షకులు సైతం సిద్ధం కానున్నారు. ‘దృశ్యం’ సినిమాను కమల్ హాసన్ హీరోగా మాతృక దర్శకుడు జీతూయే ‘పాపనాశనం’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు.
ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు దగ్గరైన సందర్భంగా పాపనాశనం విశేషాలను తెలియజేశారు కమల్. “నన్ను నేను ఎప్పటికీ ఓ స్టార్‌లా కాకుండా కామన్‌మ్యాన్‌గానే గుర్తిస్తా. కామన్ మ్యాన్‌లా ఆలోచిస్తాను కాబట్టే.. ఓ కామన్ మ్యాన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పోరాడే సినిమాలో నటించా” అంటూ సినిమా విశేషాలను తెలియజేశారు. ఇక ఈ సినిమా ద్వారా నటి గౌతమి రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందాన్నిచ్చిందని కమల్ ఈ సందర్భంగా అన్నారు.
ఇక తెలుగు, మళయాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ థ్రిల్లర్, తమిళ ప్రేక్షకులను కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని కమల్ ధీమాగా ఉన్నారు. కమల్ గత చిత్రం ఉత్తమ విలన్ మంచి రివ్యూస్ సంపాదించుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫెయిలయింది. పాపనాశనం బాక్సాఫీస్ పరంగానూ మంచి విజయం సాధిస్తుందని కమల్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

