మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, విలక్షణ సినిమాల దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో ‘కంచె’ పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక బలమైన ఎమోషన్‌ను చూపించే క్రిష్, ‘కంచె’ సినిమాను రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడిచే ఓ ప్రేమకథకు ముడిపెట్టి తెరకెక్కించారు. సెప్టెంబర్ 17న వైజాగ్‌లో పెద్ద ఎత్తున ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ ఆడియో రిలీజ్ వేడుకను హైద్రాబాద్‌కు షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ముందే ప్రకటించినట్లుగానే సెప్టెంబర్ 17వ తేదీన హైద్రాబాద్‌లో ‘కంచె’ ఆడియోను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతా ఫిదా అయిపోయారు. పలువురు స్టార్ హీరోలు సైతం ఈ ట్రైలర్‌ను కొనియాడారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే!


