టాలీవుడ్ సూపర్ స్టార్ పై ప్రసంశలు కురిపించిన కన్నడ సూపర్ స్టార్

టాలీవుడ్ సూపర్ స్టార్ పై ప్రసంశలు కురిపించిన కన్నడ సూపర్ స్టార్

Published on Sep 29, 2023 9:43 AM IST

Shivanna
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్, చరిష్మా, బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోగా నటించిన ఫస్ట్ మూవీ రాజకుమారుడు తో అతి పెద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు అక్కడి నుండి కెరీర్ పరంగా ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్లారు. కోట్లాది ప్రేక్షకాభిమానుల గుండెల్లో సూపర్ స్టార్ గా చెరగని ముద్ర వేసుకున్న మహేష్ బాబుకు ఎప్పటి నుండో బాలీవుడ్ సహా పలు ఇతర ఇండస్ట్రీల్లో ఎందరో అభిమానులు ఉన్నారు. అలానే పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయన పై అమితమైన ప్రేమాభిమానాలు కురిపిస్తుంటారు.

అయితే విషయం ఏమిటంటే, కన్నడ సూపర్ స్టార్ గా ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న శివ రాజ్ కుమార్ (శివన్న) ప్రస్తుతం ఘోస్ట్ మూవీ చేస్తున్నారు. అయితే నిన్న తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ద్వారా ఫ్యాన్స్ తో కొద్దిసేపు చాట్ సెషన్ నిర్వహించారు శివన్న. అందులో భాగంగా మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్స్ హ్యాండిల్ వారు మహేష్ బాబు తో మీకు ఉన్న అనుబంధం గురించి చెప్పండి అంటూ మహర్షి మూవీ టైం లో శివన్న తో మహేష్ బాబు దిగిన పిక్ ని పోస్ట్ చేసారు. మహేష్ బాబు మితభాషి, అలానే వృత్తి పరంగా ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి అని అన్నారు.

అంతటి సాఫ్ట్ స్పోకెన్ పర్సెన్ పలు ఎలెక్ట్రిఫయింగ్ రోల్స్ లో కనబరిచే అద్భుత పెర్ఫార్మన్స్ చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని, అలానే కెరీర్ పరంగా ఆయనకు ఆయనని ప్రేమించే అభిమానులకు ఆల్ ది బెస్ట్ అని శివన్న రిప్లై ఇచ్చారు. కాగా ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి శివన్న తో పాటు ఆయన తమ్ముడైన దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ తో కూడా మహేష్ బాబుకు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. దూకుడు కన్నడ రీమేక్ అయిన పవర్ మూవీలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించగా, ఆ మూవీ యొక్క ఆడియో రిలీజ్ వేడుకకి స్పెషల్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వెళ్లి సందడి చేసిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు