పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అనే సినిమా ప్రస్తుతం గుజరాత్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మరో నెలరోజుల పాటు గుజరాత్‌లోనే షూటింగ్ జరుపుకోనుంది. ఇక గుజరాత్‌లో ఈ షెడ్యూల్ కోసం సినిమా టీమ్ బస చేస్తోన్న హోటల్లో పవన్ కళ్యాణ్‌ను లెజెండరీ క్రికెటర్ సరదాగా కలవడం ఆసక్తికరంగా కనిపించింది.
ఇండియాలో క్రికెట్‌కు ఓ సరికొత్త క్రేజ్‌ను తెచ్చిపెట్టిన వారిలో ఒకరుగా నిలిచిన క్రికెటర్ కపిల్ దేవ్, పవన్ కళ్యాణ్‌ను ఓ సందర్భంలో అనుకోకుండా కలిశారు.
ఇక ఈ సందర్భంగా పవన్‌తో కొద్దిసేపు సరదాగా ముచ్చటించిన ఆయన గతంలో పవన్ నటించిన పలు సినిమాలను చూశానని తెలిపారు. ఇటు పవన్ సైతం ఇండియన్ క్రికెట్‌కు కపిల్ అందిస్తోన్న సేవలను కొనియాడారు. ఇక కపిల్ దేవ్ తమ టీమ్‌ను పలకరించడం, పవన్‌తో సరదాగా ముచ్చటించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సర్దార్ టీమ్ పలు ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం విడుదల చేసింది. ఇక శరత్ మరార్ నిర్మాణంలో రూపొందుతోన్న సర్దార్ సినిమా సమ్మర్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే!


