యువ నటుడు కార్తీ కెరీర్ పరంగా తన సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ సంవత్సరం ఆయన ఇప్పటికే PS 2 లో కనిపించి మరొకసారి ప్రేక్షకాభిమానులని అలరించారు. ఇక ప్రస్తుతం రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న జపాన్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు కార్తీ. ఈ సినిమా టైటిల్ తోనే సినీ అభిమానుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది.
అయితే విషయం ఏమిటంటే, అసలు ఈ సినిమాకు జపాన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు, కార్తీ పాత్రకు ఈ ఆసియా దేశం పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని రేపు ఉదయం 11:00 గంటలకు రివీల్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన జపాన్ పోస్టర్లు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమాలో కార్తీ కి జోడిగా అందాల నటి అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా జపాన్ మూవీ 2023 దీపావళికి ఆడియన్స్ ముందుకు రానుంది.


