వర్మ ‘వీరప్పన్’కు లైన్ క్లియర్, కొత్త రిలీజ్ డేట్!

వర్మ ‘వీరప్పన్’కు లైన్ క్లియర్, కొత్త రిలీజ్ డేట్!

Published on Dec 3, 2015 3:07 PM IST

Killing-Veerappn
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కిల్లింగ్ వీరప్పన్ పేరుతో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా కావడంతో కిల్లింగ్ వీరప్పన్‌పై మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ వచ్చింది. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించడం కూడా ఈ సినిమాకు ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

ఇక ట్రైలర్, పోస్టర్స్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా రిలీజ్‌కు దగ్గరైన సమయంలో, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి సినిమాపై బ్యాన్ విధించాలంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ హిందీలో మాత్రమే ఈ సినిమా చేస్తానని మాటిచ్చి ఇప్పుడు ఇన్ని భాషల్లో తీశారని, తమ భాషలోనూ సినిమా విడుదలవుతున్నందున తమ కుటుంబానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇక వీరప్పన్ భార్య డిమాండ్‌తో డిసెంబర్ 4కు రిలీజ్ కావాల్సిన సినిమాకు సడెన్‌గా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ స్వయంగా ముత్తులక్ష్మితో చర్చలు జరిపి కిల్లింగ్ వీరప్పన్ సినిమాకు లైన్ క్లియర్ చేసుకున్నారు. ముత్తులక్ష్మితో స్నేహపూర్వకంగా చర్చలు ముగిసాయని, ఇక సినిమా రిలీజ్‌కు ఏ అడ్డంకులూ లేవని తెలుపుతూ, డిసెంబర్ 11న సినిమా విడుదల చేయనున్నామని వర్మ ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ.. ఇలా అన్ని భాషల్లో ఒకేసారి సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు