వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ ఆడియో రిలీజ్ డేట్

Killing-Veerappn
ఒకప్పుడు పలు అద్భుతమైన సినిమాలతో దేశవ్యాప్తంగా అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్య కాలంలో తనదైన సినిమా చేయలేకపోయిన వర్మ కెరీర్ దాదాపుగా చివరిదశకు చేరిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కాగా ఆయన అభిమానులు మాత్రం వర్మ ఎప్పుడెప్పుడు తనదైన మార్క్ సినిమా తీస్తాడా? చూసి ఆనందిద్దామా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాతో వర్మ తన అభిమానులకు తన మార్క్ సినిమాను అందిస్తాడనే ప్రచారం ప్రస్తుతం బాగా జరుగుతోంది.

దక్షిణ భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరుగాంచిన వీరప్పన్ జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని వర్మ కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్రలో నటించారు. వీరప్పన్‌ను చంపిన ఓ పోలీస్ కథగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు కలిగించాయి. ట్రైలర్ చూసిన వారంతా వర్మ ఈసారి కచ్చితంగా హిట్ కొడతాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను నవంబర్ 2న బెంగళూరులో జరపనున్నారు. రవిశంకర్, మున్నా కాశి, రాజశేఖర్‌లు సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో మొత్తం మూడు పాటలున్నాయి. కన్నడ స్టార్స్ శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి కిల్లింగ్ వీరప్పన్ పాటలను విడుదల చేయనున్నారు. ఇక అదే రోజు ఈ మూడు పాటలకు సంబంధించిన వీడియో సాంగ్స్ కూడా విడుదల కానున్నాయని వర్మ తెలిపారు. నవంబర్ నెలాఖర్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి పెద్ద ఎత్తున ఈ సినిమాను విడుదల చేసేందుకు వర్మ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version