ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో మంచి డిమాండ్ ఉన్న రైటర్ ‘కోన వెంకట్’. ఇప్పటి వరకూ తన రచనలతో పలు సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించిన కోన ఇండస్ట్రీకి పరిచయమైంది రచయితగానే అయినా ఇప్పుడు నిర్మాత అవతారమెత్తాడు.ఇంతకు మునుపే గీతాంజలి సినిమాకి నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ సాదించిన ఇతను ప్రస్తుతం శంకరాభరణం అనే సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 4న పెద్ద ఎత్తున రిలీజ్ అవడానికి సిద్దమవుతోంది.
అయితే ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం కోన సినీ నిర్మాణ సంస్థ ‘రిలయన్స్’తో కలిసి మూడు సినిమాలు చేయాలని డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కోన మాట్లాడుతూ ‘ శంకరాభరణం సినిమా రిలీజైన తరువాత ఫిలిం మేకింగ్ ను సీరియస్ గా తీసుకుంటాను. ఓ నిబద్దత ఉన్న నిర్మాతగా మారతాను. అలాగే వచ్చే సంవత్సరం కనీసం 3 సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నన్ను భాగస్వామిని చేసుకోవాలనుకుంటోంది. నేను క్రియేటివిటీపై దృష్టి పెడితే వాళ్ళు బడ్జెట్ సంగతి చూసుకుంటారు. చూడాలి ఈ డీల్ ఎలా ఉండబోతోందో’ అని అన్నారు. ప్రస్తుతం రిలయన్స్ సంస్థ సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.


