కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై స్పందించిన కొరటాల శివ !

గత కొన్ని రోజులుగా తెలుగు పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వాడీ వేడిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని నటి శ్రీరెడ్డి మీడియా ముందుకొచ్చి తీవ్ర నిరసన తెలియజేస్తూ కొందరి పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలా ఆరోపణలు ఎదుర్కున్న వారిలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు. ఆయన పేరు మీదున్న వాట్సాప్ సంభాషణలే ఆరోపణలకు సాక్ష్యాలని కొన్ని స్క్రీన్ షాట్స్ కూడ సోషల్ మీడియాలో హడావుడి చేశాయి.

ఇన్నాళ్లు ‘భరత్ అనే నేను’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఆయన అవి ముగియడంతో బయటికొచ్చి ఆ వార్తలపై స్పందించారు. మొదట్లో ఈ రూమర్లను పట్టించుకోలేదని చెప్పుకొచ్చిన ఆయన రేపటి నుండి ‘భరత్ అనే నేను’ ప్రమోషనల్ కోసం మీడియా ముందుకురావాలి కనుక ముందే ఈ ఆరోపణపై స్పష్టత ఇస్తే బాగుంటుందని భావించి మాట్లాడుతున్నానని అన్నారు.

తానసలు కాస్టింగ్ కౌచ్ ను ఎంకరేజ్ చేయనని అన్న ఆయన పేరును ప్రస్తావించకుండా ఒక మహిళ తనపై చేసిన ఆరోపణ తనకు కొంత ఇబ్బంది కలిగించిందని, ఆడవాళ్లు తమ సమస్యలపై పోరాడటం మంచి విషయమని, వారికి తాను కూడ సపోర్ట్ చేస్తానని, తనకు వారి విలువ తెలుసని, తాను ఆడవాళ్లను చాలా గౌరవిస్తానని, తనకు తన సినిమాకు ప్రేక్షకుల సపోర్ట్ కావాలని అన్నారు.