ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు చాలా కాలం నుంచి ఓ చిత్రానికి దర్శకత్వం వహించాలని అనుకుంటున్నారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి తాను చిత్రాలకు నిర్మాత గా వ్యవహరిస్తున్నానని, 60శాతం విజయాలతో చిత్రాలను తానూ నిర్మించానని ఆయన అన్నారు. ఇప్పుడు సొంతంగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించాలను కొంటున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలో చాలా మంది తనకు షార్ట్ టెంపర్ అని అంటున్నారని, కొంత మంది దగ్గర అలా ప్రవర్తించడం తప్పు విషయం కాదని రామారావు అన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజుల్లో చిత్రాలను నిర్మించాలంటే చాలా కష్టంగా ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో సినిమాలు నిర్మించడం చాలా కష్టంగా ఉంటుందని, కానీ చిత్రాలను నిర్మించడం తాను మాననన్నారు. తాను గతంలో లాగే తన వృత్తిని కొనసాగిస్తున్నానని, తన కుమారుడు వల్లభ్ తన వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారన్న నమ్మకం తనకు ఉందని రామారావు తెలిపారు.
అయితే తన తదుపరి చిత్రంలో తన కొడుకును హీరోగా పెట్టి ఓ సినిమా తియ్యాలన్న ఆలోచనలో కేఎస్ రామారావు ఉన్నట్లు సమాచారం . నారా రోహిత్, రెజినా జంటగా జూన్ లో వస్తున్న శంకర మరియు ఉలవచారు బిర్యానీ మధ్యలో ఏదైనా ఓ ప్రాజెక్ట్ చెయ్యాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై పూర్తి స్దాయి కుటుంబ చిత్రాన్ని నిజాయతీగా నిర్మిస్తామని కేఎస్ రామారావు స్పష్టం చేశారు.


