
తెలుగులో హాస్యకథల సినిమాలను ఇష్టపడే వారికి 1980, 90ల దశకంలో స్టార్ దర్శకుడుగా పేరుగాంచిన వంశీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘సితార’, ‘అన్వేషణ’, ‘ఆలాపన’ వంటి వైవిధ్యభరితమైన సినిమాలతో పాటు ‘ఏప్రిల్ 1 విడుదల’, ‘చెట్టుకింద ప్లీడర్’, ‘లేడీస్ టైలర్’ లాంటి కథా బలమున్న కామెడీ సినిమాలు దర్శకుడిగా ఆయన స్థాయిని చెప్పే సినిమాలుగా చెప్పుకోవచ్చు. ‘అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా తర్వాత ఎక్కువగా ప్రేమకథలనే తెరకెక్కించిన వంశీ 25వ సినిమా ‘మెల్లగా.. తట్టింది మనసు తలుపు’.
‘తను మొన్నే వెళ్ళిపోయింది’ పేరుతో చాలా కాలం క్రితమే 70శాతం పూర్తైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ‘365 డేస్’ సినిమాను నిర్మించిన డి. వెంకటేష్ ఈ సినిమా మిగిలిన భాగాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను ‘మెల్లగా.. తట్టింది మనసు తలుపు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ హైద్రాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శకుడు వంశీ, హీరో అజ్మల్, హీరోయిన్ నిఖితా నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు నిర్మాత ఈ సందర్భంగా తెలిపారు.

